PM Modi Mission 2024 : దక్షిణాది రాష్ట్రాలు -యూత్ ఓట్లే టార్గెట్..!
PM Modi urged party leaders to increase their outreach to voters: ప్రధాని మోదీ 2024 ఎన్నికల మిషన్ డిసైడ్ చేసారు. హ్యాట్రిక్ విజయం కాదు, ప్రతీ సీటు గెలుపే లక్ష్యం కావాలని నిర్దేశించారు. వచ్చే ఎన్నికలకు 400 రోజులే సమయం ఉందని, ప్రతీ ఓటరను కలవాలని పార్టీ నేతలకు సూచించారు. రానున్న ఎన్నికల కోసం ముఖ్యంగా దక్షిణాది పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాలన్నారు. ఈ సారి యువతను ఆకట్టుకొనేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలు ముగిసే వరకూ ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కొనసాగించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని ముగింపు ప్రసంగం చేసారు. ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రణాళికలే అజెండాగా ఈ సమావేశాలు జరిగాయి.
కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణలో ప్రభుత్వ ఇబ్బందులను అధిగమించి బండి సంజయ్ చేసిన పాదయాత్రను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పార్టీ జాతీయాధ్యక్షుడితో పాటుగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల అధ్యక్షులను కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో, తెలంగాణలో బండి సంజయ్ పదవీ కాలం ముగిసే అవకాశంఉంది. జాతీయ కార్యవర్గ సమావేశాలలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. నడ్డా నాయకత్వంలోనే లోక్ సభ ఎన్నికలకు వెళ్తామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రధాని కోరారని చెప్పారు. 2047 కల్లా స్వాతంత్రానికి వంద సంవత్సరాలు పూర్తి అవుతాయన్నారు. తెలంగాణలో దోపిడీ చేశారు, ఇక దేశాన్ని దోపిడీ చేసేందుకు బీఆర్ఎస్ స్థాపించారని విమర్శించారు.
ఎన్ని సమావేశాలు పెట్టినా, కల్వకుంట్ల కుటుంబం ఫామ్ హౌస్ కు వెళ్ళడం ఖాయమని ఎద్దేవా చేసారు. రెండు రోజుల సమావేశంలో అనేక అంశాలపైన చర్చ జరిగిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. జేపీ నడ్డా ను తిరిగి నియమించడం స్వాగతిస్తున్నామన్నారు. ప్రధాని మోడీ మార్గదర్శనం దొరకడం తమ అదృష్టంగా పేర్కొన్నారు. మోడీ స్పూర్తితో తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం స్తాపిస్తామన్నారు. తెలంగాణలో రామరాజ్యం స్థాపన చేస్తామని ధీమా వ్యక్తం చేసారు. ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో మోడీ ప్రత్యేక శ్రద్ద కనబరిచారని చెప్పారు. యాత్ర ఫీడ్ బ్యాక్ ఆయన వద్ద ఉందని వివరించారు. అన్ని రాష్ట్రాల కు ఈ అంశంపై సూచనలు చేశారని బండి చెప్పారు. మోడీ ఆలోచనతో మోడీ స్ఫూర్తితో మరింతగా ముందుకు వెళతామన్నారు. తెలంగాణా లో బీజేపీ సర్కారు ఏర్పాటు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేసారు. రాబోయే రోజుల్లో మరింత దూకుడు గా వెళతామని వివరించారు.