PM Modi On Cinemas: సినిమాలను కెలకొద్దన్న ప్రధాని మోదీ..ఎవరికీ చురకలు
PM Modi asks to refrain from making unnecessary remarks on irrelevant issues like movies: ప్రధాని మోదీ సినిమాల పైన కామెంట్స్ చేసే వారికి సూచనలు చేసారు. సొంత పార్టీ నేతలను అందులో మినహాయించ లేదు. కొంత కాలంగా తెలుగు రాజకీయాలతో పాటుగా జాతీయ స్థాయిలో సినిమాల వివాదాలు..రాజకీయ నేతల వ్యాఖ్యలు కామన్ గా మారాయి. నిరుడు.. టిక్కెట్ రేట్లు అడ్డంగా తగ్గించి.. ఆఖరికి అధికారులనూ సినిమా హాళ్ల తనిఖీకి పంపి, తమ ప్రత్యర్థి, జన సేన నాయకుడు పవన్ కల్యాణ్ సినిమా విడుదలకు అనేక అడ్డంకులు కల్పించి.. మొత్తం తెలుగు సినిమా వాళ్లని కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికీ కొత్త సినిమా విడుదలకు ముందు ఏపీలో ఏం అడ్డంకులు ఎదురవుతాయా? అనే భయం సినిమా వాళ్లలో ఉంది.
రెండేళ్ల కిందట ఆర్ఆర్ఆర్ గ్లింప్సెస్ విడుదల కాగానే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ .. కొమురం భీముడు పాత్రధారి జూ.ఎన్టీఆర్ ముస్లిం టోపీ పెట్టుకుని కనిపించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాను ఆడనీయం అని కూడా ప్రకటించారు. కొన్ని నెలల కిందట కశ్మీర్ ఫైల్స్ సినిమాపై అనేక అభ్యంతరాలు.. అందులో పండిట్ల అంశం రాజకీయంగా బీజేపీకి లాభదాయకం అంటూ విమర్శలు. పండిట్ల ఊచకోతను కాషాయ పార్టీకి లబ్ధి కలిగే అంశంగా వాడుకున్నారంటూ ఆరోపణలు.
నెల రోజుల నుంచి.. షారూఖ్ ఖాన్, దీపికా పడుకోన్ నటించిన ‘పఠాన్’ సినిమా పాట ‘బేషరమ్’లో సీన్లపై అభ్యంతరాలు. ఆ పాటలో దీపికా వస్త్రధారణ కాస్త శ్రుతిమించిన మాట వాస్తవమే అయినా.. రాజకీయ నాయకుల వ్యాఖ్యలు దీనిని మరింత రెచ్చగొట్టేలా సాగాయి. సినిమాపై నిషేధం విధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అయితే, ‘‘అసభ్యత ఎక్కువగా ఉన్న సీన్లను తొలగించకపోతే మా రాష్ట్రంలో పఠాన్ విడుదలపై కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. బాలీవుడ్ కేంద్రమైన ముంబై ఉన్న, బీజేపీ కూటమి అధికారంలోని మహారాష్ట్రలోనూ కొందరు బీజేపీ నేతలు ఈ చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
కానీ ఇప్పుడు వీటన్నిటికీ చెక్ పెట్టేలా.. సొంత పార్టీ వారితో పాటు అన్ని పార్టీల వారికీ చురకలాంటి వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేశారు. ‘‘అసంబద్ధ విషయాలపై అనవసర వ్యాఖ్యలు మానుకోండి. అభివృద్ధి కోసం రాత్రి పగలూ మనమంతా కష్టపడుతున్నాం. కానీ మనలో కొందరు సినిమాల వంటి సంబంధం లేని అంశాలపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి టీవీల్లో పదే పదే ప్రసారమవుతున్నాయి. దీంతో పార్టీ అభివృద్ధి అజెండా పక్కకు పోతోంది. అందుకే అలాంటి అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోండి’’ అంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నాయకులకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ నేరుగా ప్రస్తావన తీసుకురానప్పటికీ.. ఆయన వ్యాఖ్యలు ‘‘పఠాన్’’ సినిమా గురించేనన్న సంగతి అందరికీ తెలిసిపోతోంది. ఆ సినిమాపై వివాదం జరుగుతున్న వేళ ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, ఇకపైనైనా ప్రధాని మాటలను పరిగణనలోకి తీసుకుని పార్టీల నేతలు, ముఖ్యంగా బీజేపీ వాళ్లు జాగ్రత్తగా ఉంటారో లేదో చూడాలి.