PM Modi TamilNadu Tour: ఈనెల 27న తమిళనాడుకు ప్రధాని మోడీ
PM Modi TamilNadu Tour: ఈనెల 27వ తేదీన ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. 27వ తేదీన ఢిల్లీ నుండి బయలుదేరి మధురైకు రానున్నారు. మధురై నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా రామేశ్వరం వెళ్తారు. రామేశ్వరంలో ప్రధాని మోడీ కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం, ప్రధాని తిరిగి మధురై చేరుకుంటారు. అక్కడి నుండి చెన్నై చేరుకొని, ఎయిర్‌పోర్ట్‌లో కొత్తగా నిర్మించిన రెండో టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పటి వరకు ఒకటే టెర్మినల్ సేవలు అందిస్తున్నది.
రద్దీని దృష్టిలో ఉంచుకొని రూ. 2400 కోట్ల నిధులతో 2.36 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య 2.20 కోట్ల నుండి 3.50 కోట్లకు చేరుకుంటుందని ఎయిర్‌పోర్ట్ అధికారులు చెబుతున్నారు. ఈనెల 27 వరకు నిర్మాణం పనులు పూర్తి చేయనున్నారు. 27వ తేదీన ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తమిళనాడు మంత్రులు పాల్గొనే అవకాశం ఉంది.