PM Modi Road Show: ఢిల్లీలో ప్రధాని మోడీ రోడ్ షో, పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
PM Modi Road Show in Delhi, traffic restrictions in several areas
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజుల పాటు ఢిల్లీలో జరగనున్నాయి. ఈ రోజు, రేపు జరిగే ఈ సమావేశాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పార్టీకి చెందిన అతిరధ మహామహులందరూ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లతో పాటూ 350 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.
జాతీయ కార్యవర్గ సమావేశం మొదటి రోజైన ఈ రోజు ఢిల్లీలో ప్రధాని రోడ్ షో జరగనుంది. పటేల్ చౌక్ నుంచి పార్లమెంట్ స్ట్రీ వరకు కిలోమీటర్ పొడవున జరగనున్న రోడ్ షో కు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని రోడ్ షో సంధర్భంగా రోడ్డు పొడవున వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుండి రోడ్ షో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రధాని భద్రతను దృష్టిలో ఉంచుకుని రోడ్ షో జరిగే రోడ్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో సందర్భంగా ఢిల్లీ పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్ధం ఒక ప్రకటన విడుదల చేశారు. అశోకా రోడ్, సంసద్ రోడ్, టాల్ స్టాయ్ రోడ్, రఫీ మార్గ్, జంతర్ మంతర్ రోడ్, ఇంతియాజ్ ఖాన్ మార్గ, బంగ్లా సాహిబ్ లేన్లు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసి ఉంటాయని తెలిపారు.
ప్రధాని రోడ్ షో సందర్భంగా రద్దీగా మారే ఇతర రోడ్ల వివరాలను కూడా పోలీసులు ప్రకటించారు. ఆయా రోడ్డు మార్గాలలో ట్రాఫిక్ విపరీంతగా పెరిగి అవకాశం ఉన్నందున ఇతర మార్గాలలో ప్రయాణించాలని ఢిల్లీ ప్రజలను పోలీసులు కోరారు.
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ జాతీయ ఆధ్యక్షుడు నడ్డా పదవి కాలం పొడగించే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది జరిగే పలు రాష్ట్రాల ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలనే విషయం కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. జాతీయ కార్యవర్గం సమావేశాల్లో రాజకీయ,ఆర్ధిక అంశాలపై తీర్మానాలు చేయనున్నారు.