PM Modi: ప్రవాసీ భారతీయులపై మోడీ ప్రశంసలు…
PM Modi on Indore Pravasi Divas: ఇండోర్‌లో జరుగుతున్న 17వ ప్రవాసీ దివస్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ముఖ్య అతిధిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు. అనంతరం ప్రధాని మోడీ సురినామే అధ్యక్షుడు చంద్రికపెర్‌సాద్ సంతోఖి, గయానా అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్ ఆలీతోనూ భేటీ అయ్యారు. విదేశాల్లో ఉన్న భారతీయులు స్వదేశం కోసం చేస్తున్న కృషిని ప్రశంసించారు. వారు విదేశీ గడ్డపై బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ నుండి వివిధ దేశాలకు వలస వెళ్లి అక్కడ పడుతున్న కష్టాలు, సాధించిన విజయాలను డాక్యుమెంటరీల రూపంలో చిత్రీకరించి విద్యార్థులకు ప్రదర్శింపజేయాలని విశ్వవిద్యాలయాలను కోరారు.
తద్వారా విద్యార్థుల్లో భారత దేశంకోసం ప్రవాసీలు చేస్తున్న కృషి గురించి తెలుస్తుందని, విద్యార్థుల్లో బాధ్యత పెరుగుతుందని అన్నారు. వసుదైక కుటుంబమనే భావనకు ప్రవాసీ భారతీయులు మరింత బలాన్ని చేకూరుస్తున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రవాసీల వలనే భారత్‌కు చెందిన ఆయుర్వేదం, హస్తకళలు, కుటీర పరిశ్రమలు, చిరుధాన్యాలు వంటివి విదేశాలకు పరిచయం అవుతున్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 17వ ప్రవాసీ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోడీ సురినామే, గయానా దేశాధ్యక్షులతో విడివిడిగా భేటీ అయ్యారు. రక్షణ, డిజిటల్ టెక్నాలజీ వంటి అంశాలపై ప్రధాని మోడీ చర్చించారు.