Gujarat Elections: అమ్మతో ప్రధాని ముచ్చట్లు
Gujarat Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేటు వేసేందుకు ప్రధాని మోడీ ఆదివారం సాయంత్రం గుజరాత్‌కు చేరుకున్నారు. గుజరాత్ రాష్ట్రానికి చేరుకున్న ప్రధాని మోడీ నేరుగా గాంధీనగర్‌లోని తన తల్లి ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లి తన తల్లి హీరాబెన్ ను కలిశారు. తల్లి ఆశీర్వాదం తీసుకొని కాసేపు ముచ్చటించారు. తల్లి ఇచ్చిన టీ ని సేవించారు. హీరాబెన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. హీరాబెన్ సైతం తన కొడుకు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మోడీ పాలన పట్ల సామాన్యుల మాదిరిగానే హీరాబెన్ సైతం ఆసక్తిగా ఉన్నారు. తల్లి అడిగిన ప్రశ్నలకు మోడీ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. తల్లితో ఉన్నంతసేపు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.
అనంతరం తల్లివద్ద ఆశీర్వాదం తీసుకొని ప్రధాని మోడీ గాంధీనగర్ బీజేపీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. కాగా, నేడు ప్రధాని మోడీ గాంధీనగర్‌లోని రాణిప్ ప్రాంతంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8:30 గంటలకు ఓటు హక్కును వినియోగించుకొని, అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు.