ఇస్రో సాధించిన చంద్రయాన్-3 విజయం చాలా గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. ఇప్పుడు ప్రతి ఇంటిపైనే కాకుండా.. జాబిల్లిపై (Moon) కూడా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని వెల్లడించారు.
PM Modi: ఇస్రో (ISRO) సాధించిన చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయం చాలా గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. ఇప్పుడు ప్రతి ఇంటిపైనే కాకుండా.. జాబిల్లిపై (Moon) కూడా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని వెల్లడించారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు మోడీ శుక్రవారం బెంగళూరుకు వెళ్లారు. గ్రీస్ నుంచి నేరుగా బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎయిర్‌పోర్టుకు వెళ్లి మోడీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత మోడీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా పీణ్యలోని ఇస్రో కార్యాలయానికి వెళ్లారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు.
చంద్రయాన్-2 ఫెయిల్ కావడంతో వెనుకడుగు వేయలేదన్న మోడీ.. మరింత పట్టుదలతో పనిచేసి చంద్రయాన్-3 విజయం సాధించామని వెల్లడించారు. ఇస్రో సాధించిన ఈ విజయం చాలా గర్వకారణమని పేర్కొన్నారు. విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో తాను సౌతాఫ్రికాలో ఉన్నప్పటికీ.. తన మనసంతా చంద్రయాన్-3 విజయంపైనే ఉందని చెప్పారు. ఇది అసాధారణ విజయమని.. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించామని వెల్లడించారు. భారత్ సత్తా ప్రపంచానికి తెలిసిందని.. ఈ విజయంతో ప్రపంచంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలమని నిరూపించామని మోడీ వివరించారు. ప్రపంచానికే భారత్ దిక్సూచిగా మారుతోందని అన్నారు.
ఇక చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అయిన ప్లేస్‌కు శివశక్తి అని పేరు పెట్టుకుందామని మోడీ అన్నారు. అంతేకాకుండా ఆగష్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుకుందామని వెల్లడించారు. మంగళ్యాన్, చంద్రయాన్ విజయాల స్ఫూర్తితో గగన్‌యాన్‌కు సిద్ధమవుదామని మోడీ వెల్లడించారు.