Parliament Sessions: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు..అగ్నిపథ్ సహా పలు కీలక అంశాలపై చర్చ
Parliament Sessions: ఈరోజు నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత పార్లమెంట్ బిల్డింగ్ లో జరుగుతున్న చివరి సమావేశాలు ఇవే. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో నిర్వహిస్తారు. ఈరోజు నుంచి ఆగస్ట్ 12 వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. కాగా, మొదటిరోజు పార్లమెంట్ భవనంలోని రాజ్యసభలో రాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల అనంతరం సమావేశాలు ప్రారంభం అవుతాయి. వర్షాకాల సమావేశాలలో 32 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టాలని చూస్తున్నది. కాగా, అగ్నిపథ్, ఆర్థికవ్యవస్థ, నిరుద్యోగం, నిత్యావసర ధరల పెరుగుదల వంటి అంశాలను లేవనెత్తాలని విపక్షాలు చూస్తున్నాయి.
ముఖ్యంగా అగ్నిపథ్ పై విపక్షాలు చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. సైనిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే, ఈ పథకం పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రగడ జరిగింది. అగ్నిపథ్ పథకం పై కేంద్రం కూడా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అగ్నిపథ్ పథకంపై ముందుగా చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రూల్ నెంబర్ 297 కింద కాంగ్రెస్, సీపీఎం ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఈ సమావేశాలు కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవడంతో మొదలయ్యి ఉప రాష్ట్రపతిని ఎన్నుకోవడంతో ముగియనున్నాయి. శ్రీలంక సంక్షోభంపై చర్చించడానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్,జైశంకర్ నేతృత్వంలో రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.