Oyo Founder Ritesh Agarwal: ఓయో అధిపతి ఇంట్లో విషాదం
Oyo Founder Ritesh Agarwal: ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తండ్రి రమేష్ అగర్వాల్ కన్నుమూశారు. శుక్రవారం గురుగ్రామ్‌లోని ఎత్తైన భవనంపై నుంచి కిందపడి రమేష్ అగర్వాల్ మరణించారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో రమేష్ అగర్వాల్ తుదిశ్వాస విడిచారు. రమేష్ అగర్వాల్ తన భార్యతో కలిసి డీఎల్ఎఫ్ కు చెందిన క్రెస్ట్ సొసైటీలో నివసిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆ భవనంలోని 20వ అంతస్తు నుంచి కింద పడిపోవడంతో మృతిచెందారు.
ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహం మార్చి 7న అంగరంగ వైభవంగా ఢిల్లీలో జరిగింది. ఇంతలోనే రితేష్ అగర్వాల్ మరణించడంతో శోకసంద్రంలోమునిగింది ఆ కుటుంబం. తన తండ్రి మరణవార్తను ధ్రువీకరిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేసాడు రితేష్ అగర్వాల్. మా నాన్న.. మా మార్గదర్శి, మా బలం, మా నాన్న రమేష్ అగర్వాల్ మార్చి 10న మరణించారని బరువెక్కిన హృదయంతో నేను, నా కుటుంబం తెలియచేస్తున్నాం. ఆయన తన జీవితమంతా ఉన్నత మార్గంలో గడిపారు. ప్రతిరోజూ మాలో చాలా మందికి స్ఫూర్తినిచ్చారు. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు. అత్యంత క్లిష్ట సమయాల్లో మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడంలో నాన్న కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. రమేష్ అగర్వాల్ కు పలువురు పారిశ్రామికవేత్తలు నివాళ్లు అర్పించారు.