ఇండియా కూటమి మూడో సమావేశం త్వరలో జరగనుంది. ఆగష్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ఇండియా కూటమి మూడో సమావేశం జరగనున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వెల్లడించారు.
INDIA: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని (BJP) గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు (Opposition Parties) వేగంగా అడుగులు వేస్తున్నాయి. కూటమిలా (Alliance) ఏర్పడి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు వ్యూహాలను రచిస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు ఇండియా కూటమి (INDIA Alliance) సమావేశమయింది. త్వరలో ఇండియా కూటమి మూడో సమావేశం కూడా జరగనుంది. ఆగష్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ఇండియా కూటమి మూడో సమావేశం జరగనున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) వెల్లడించారు.
ముంబైలో రెండు రోజుల పాటు ఈ సమావేశం జరగనున్నట్లు స్టాలిన్ తెలిపారు. డీఎంకే పార్టీ తరుపున తాను కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు చెప్పారు. ఇక ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ప్రకటించబోతున్నామని వివరించారు. అలాగే మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఇండియా కూటమిలో చేరబోతున్నాయని స్టాలిన్ తెలిపారు.
ఇకపోతే ఇండియా కూటమి ఏర్పాటులో బిహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ప్రధాన విపక్ష పార్టీలతో సమావేశమయి ఏకం చేశారు. అలాగే తొలి సమావేశాన్ని తన అధ్యక్షతన బిహార్ రాజధాని పట్నాలో నిర్వహించారు. మొత్తం 16 పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ఆ తర్వాత జులైలో బెంగళూరులో కూటమి రెండో సమావేశం జరిగింది. జులై 17, 18 తేదీల్లో జరిగిన ఈ సమావేశానికి 26 ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. ఈ సమావేశంలోనే కూటమికి ఇండియాగా నామకరణం చేశారు.