పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కొత్త పార్లమెంటు బిల్డింగ్ 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు.
New Parliament Controversy: పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కొత్త పార్లమెంటు బిల్డింగ్ 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులు ఉంటాయి. ప్రస్తుత భవనాన్ని పోలినట్లు ఉండే కొత్త పార్లమెంట్ ఎత్తు కూడా పాత భవనం అంతే ఉంటుంది. ఒకేసారి 1272 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. సభాపతులు, మంత్రులకు ప్రత్యేక ఆఫీసులు ఉన్నాయి. ఎంపీల కోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీ హాల్స్, క్యాంటీన్లు ఏర్పాటు చేశారు.
ప్రధాని మోడీని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కలిశారని, కొత్త భవనాన్ని ప్రారంభించాలని స్పీకర్ కోరారని ఈ నెల 18న లోక్ సభ సెక్రటేరియట్ అఫీషియల్ ట్వీట్ చేసింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. ఈ ప్రారంభోత్సవాన్ని లోక్ సభ స్పీకర్ లేదా రాజ్య సభ చైర్మన్ ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం ప్రధాని శాసన సభకు కాదు కార్యనిర్వాహక వర్గానికి అధిపతి అని పేర్కొన్నారు. మనకు అధికారాల విభజన స్పష్టంగా జరిగిందన్నారు. పార్లమెంట్‌కు అధిపతులు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అని అన్నారు. అందువల్ల వారిచేత ప్రారంభించవచ్చ.న్నారు. పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రజాధనంతో నిర్మించారని తెలిపారు.
ఇక తాజాగా పార్లమెంట్ భవనాన్ని మోడీ ప్రారంభించడాన్ని రాహుల్ గాంధీ తప్పుపట్టారు. కొత్త భవనాన్ని ప్రారంభించాల్సింది ప్రధాని కాదని, రాష్ట్రపతి అని అన్నారు. త్రిభుజాకార ఆకారంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనాన్ని ప్రధాని మోడీ మే28న ప్రారంభించనున్నారు. అయితే, అదేరోజు మే 28 హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్ జయంతి వేడుకలు జరగనున్నాయి. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సావర్కర్ జయంతి రోజున జరగనుండటం కూడా రాజకీయ రగడకు దారితీసింది. ప్రధానమంత్రి ప్రభుత్వాధినేత అయితే, రాష్ట్రపతి భారత దేశానికి అధిపతి అని, ఆమెను ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం అవమానమని, ఆమె పదవిని కించపరచడమేనని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్‌కు రాష్ట్రపతే అధిపతి. కాబట్టి దానిని రాష్ట్రపతి ప్రారంభించాలి అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఆనంద్ శర్మ పేర్కొన్నారు.
పార్లమెంట్ భవనంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. కొత్త చిహ్నంపై విపక్షాలు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. హుందాగా, రాజసంగా, ఆత్మవిశ్వాసంతో ఉండే నాలుగు సింహాలు.. క్రూరంగా, గర్జిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయని.. తక్షణమే ఆ సింహాలను మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు బిల్డింగ్ ను 1927లో నిర్మించారు. దాదాపు వందేళ్ల క్రితం నాటి ఈ బిల్డింగ్ ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా లేకపోవడం, లోక్ సభ, రాజ్యసభలో ఎంపీలు కూర్చునేందుకు సరైన సౌకర్యం లేకపోవడంతో కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. 2020 డిసెంబర్ లో ప్రధాని నరేంద్రమోడీ కొత్త పార్లమెంటు బిల్డింగ్ నిర్మిణానికి భూమిపూజ చేశారు. కొత్త భవనంలోని పార్లమెంటు జాయింట్ సెషన్ నిర్వహించేందుకు అనువుగా లోక్ సభ ఛాంబర్ ను ఏర్పాటు చేశారు.
బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి మే 26 నాటికి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. 2014 లో తొలిసారి బీజేపీ నాయకత్వంలోని ఈ ఎన్డీయే ప్రభుత్వం మే 26వ తేదీన ప్రమాణ స్వీకారం చేసింది. ఆ తరువాత 2019లో మే 30వ తేదీన రెండోసారి అధికార పగ్గాలు చేపట్టింది. ఈ సందర్భంగా ఉత్సవాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభం చేయాలని నిర్ణయించింది.