Presidential Elections: రాష్ట్రపతి అభ్యర్థి కోసం ప్రతిపక్షాల ప్రయత్నం..ఆయన ఓకే చెప్తారా..!
రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్‌ల గడువు ఈనెల 29తో ముగియనున్నది. గడవు సమీపిస్తుండటంతో ప్రతిపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాలు పోటీకి నో చెప్పారు. తాజాగా మమతా బెనర్జీ మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేరును ప్రతిపాదించింది. అయితే, ఆయన కూడా పోటీకి నో చెప్పారు. దీంతో మరికొందరి పేర్లను పరిశీలించేందుకు నేడు ప్రతిపక్షాలు భేటీ కానున్నాయి. శరద్ పవార్ నేతృత్వంలో 17 పార్టీలు భేటీ కాబోతున్నాయి. ఈ భేటీ తరువాత అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మాజీ ఆర్ఠికశాఖ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు సైతం వినిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం ఆయనతో చర్చిస్తున్నాయి.
గతంలో ఆయన ప్రధాని మోడీపై పలు విమర్శలు చేశారు. అటల్ ప్రధానిగా ఉన్నప్పుడు యశ్వంత్ సిన్హా ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. మోడీ ప్రధాని అయ్యాక ఆ పార్టీతో అంటిముట్టనట్లుగా ఉన్న యశ్వంత్ సిన్హా ఆ తరువాత వీలు దొరికినప్పుడల్లా ప్రధానిపై విమర్శలు చేస్తున్నారు. కాగా, ఈయన ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రతిపక్షాల ఐక్యతను, జాతీయ ఏకాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా రాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ఎంపిక చేయాలని గోపాలకృష్ణ గాంధీ పేర్కొన్నారు. తనను పోటీ చేయాలని అడిగిన ప్రతిపక్ష పార్టీలకు, నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి చివరి గవర్నర్ జనరల్‌గా ఉన్న రాజాజీ, మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ వంటి వ్యక్తులు రాష్ట్రపతి పదవిలో ఉండాలని తాను కోరుకుంటున్నట్లు గోపాలకృష్ణ గాంధీ తెలిపారు.