Manish Sisodia arrest: మనీశ్ సిసోడియా అరెస్టుకు నిరసనగా ప్రధానికి విపక్షాల లేఖ
Opposition Leaders Write To PM Modi Over Sisodia’s Arrest
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టుకు నిరసనగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు చెలరేగాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని హోరెత్తారు. ఈ నేపథ్యంలో దేశంలో 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. సిసోడియా అరెస్టు ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి చెడ్డపేరు తీసుకువస్తుందని లేఖలో సీఎంలు పేర్కొన్నారు. మన దేశం డెమోక్రసీ నుంచ ఆటోక్రసీగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాసిన లేఖకు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ నేత శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే, తెలంగాణ సీఎం కేసీఆర్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బెంగాల్ సీఎం మమత బెనర్జీ, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్ధుల్లా తదితరులు మద్దతుగా నిలిచారు. అరవింద్ కేజ్రీవాల్ తో సహా వీరందరూ సంతకాలు చేశారు.
మనీశ్ సిసోడియాపై మోపిన అభియోగాలు నిరాధారమని, రాజకీయ కుట్రలో భాగంగా అరెస్టు చేశారని లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ఢిల్లీలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మనీశ్ సిసోడియా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని లేఖలో ప్రస్తావించారు. మనీశ్ సిసోడియా అరెస్టు ద్వారా ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో పడ్డాయని ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని లేఖలో ప్రస్తావించారు. దర్యాప్తు సంస్థలపై భారత ప్రజలలలో విశ్వాసం కోల్పోతున్నాయని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నారు.