రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన విపక్ష కూటమి.. రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
ఎట్టకేలకు విపక్ష కూటమి రాష్ట్రపతి అభ్యర్థిపై ఓ క్లారిటీకి వచ్చింది. విపక్ష కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను విపక్షాల ఉమ్మడి అభ్యర్థులు ఖరారు చేశారు. ఇవాళ యశ్వంత్ సిన్హాతో విపక్ష పార్టీల నేతలు సమావేశం అయ్యారు. ఆయన్ను రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలని కోరగా అందుకు అంగీకరించిన యశ్వంత్ సిన్హా టీఎంసీ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం అయన్ను విపక్ష కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా నియమిస్తున్నట్లు జైరాం రమేష్ ప్రకటించారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఎన్.ఎక్స్ భవన్‌లో సమావేశమైన విపక్ష నేతలు.. రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికపై క్లారిటీకి వచ్చినట్లు తెలిపారు.
విపక్ష కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను నియమకానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం మద్దతు తెలిపారని శరద్ పొవార్ తెలిపారు. ఎన్.ఎక్స్ భవన్‌లో సమావేశమైన విపక్ష నేతలు.. రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నియమిస్తున్నట్లు శరద్ పొవార్ కేసీఆర్‌కు ఫోన్ ద్వారా చెప్పినట్లు తెలిపారు. దానికి కేసీఆర్ మద్దతు తెలిపినట్లు ఆయన తెలిపారు. దీంతో యశ్వంత్ సిన్హాకు టీఆర్‌ఎస్ పార్టీ సైతం మద్దతు ప్రకటించింది.
యశ్వంత్ సిన్హా మాజీ ఐఏఎస్ అధికారి. సివిల్ సర్వీస్ నుంచి తప్పుకున్న అనంతరం ఆయన 1984లో జనతాదళ్‌లో చేరారు. గత ఏడాది బీజేపీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా పని చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు యశ్వంత్ ప్రకటనతో రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫు అభ్యర్థిగా పోటీ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరిగింది. చివరకు అదే నిజమైంది.
రాష్ట్రపతి అభ్యర్థి కోసం ప్రతిపక్షాలు తొలుత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును ప్రస్తావించడంతో ఆయన దానికి నో చెప్పారు. అనంతరం నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాను సైతం విపక్షాలు కోరగా ఆయన కూడా పోటీ చేయనని తప్పుకున్నారు. తర్వాత బెంగాల్ మాజీ గవర్నర్, గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేరును మమత ప్రస్తావించగా.. తాను కూడా ఈ ఎన్నికల్లో పనిచేయనని వెల్లడించారు. ప్రతిపక్ష నాయకుల్లో గోపాలకృష్ణ పట్ల ఏకాభిప్రాయం లేకపోవడం, కొన్ని పార్టీలు సమావేశానికి హాజరవకపోవడంతోనే ఆయన వెనక్కు తగ్గారు.