శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిపోలేదని వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ కేవలం తమతో రాజకీయంగా మాత్రమే విభేదించారని అన్నారు. అంత మాత్రాన ఎన్సీపీలో చీలిక వచ్చిందని ఎలా అంటారని శరద్ పవార్ ప్రశ్నించారు.
Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాలను (Maharashtra Politics) ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) కీలక మలుపు తిప్పిన విషయం తెలిసిందే. అధికార పార్టీతో చేతులు కలిపి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిపోయారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు (Sharad Pawar) గుడ్ బై చెప్పి.. డిప్యూటీ సీఎం పదవి పొందారు. అప్పటి నుంచి అటు శరద్ పవార్.. ఇటు అజిత్ పవార్ ఎన్సీపీని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు శరద్ పవార్. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిపోలేదని వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ కేవలం తమతో రాజకీయంగా మాత్రమే విభేదించారని అన్నారు. అంత మాత్రాన ఎన్సీపీలో చీలిక వచ్చిందని ఎలా అంటారని శరద్ పవార్ ప్రశ్నించారు. అజిత్ పవార్ ఇప్పటికీ తమతో కలిసే ఉన్నారని చెప్పుకొచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా అజిత్ పవార్ తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని.. ఆయన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడించారు.
కొంత మంది ఎన్సీపీని వదిలి వెళ్లారని.. మరికొందరు రాజకీయంగా తమతో విభేదించారని.. దానినే చీలిక అంటే ఎలా అని శరద్ పవార్ ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో చాలా మంది నాయకులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వెళ్తుంటారన్న శరద్ పవార్.. దాన్ని పార్టీలో చీలిక రావడం అంటారా అని నిలదీశారు.