FMGE: ఉక్రెయిన్ వైద్య విద్యార్ధులకు వెసులుబాటు కల్పించిన కేంద్రం
ఉక్రెయిన్ నుంచి భారత్ తిరిగి వచ్చిన వైద్య విద్యార్ధులకు కేంద్రం ఓ వెసులుబాటు కల్పించింది. చైనా నుంచి గానీ, ఉక్రెయిన్ నుంచి, కరోనా మహమ్మారి కారణంగాను, ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ తిరిగి వచ్చిన వైద్య విద్యార్ధులకు ఓ అవకాశం కల్పించింది. ఫైనల్ ఇయర్ విద్యార్ధులంతా FMGE ఫారిన్ మెడికల్ గ్యాడ్యుయేట్ ఎగ్జామ్ రాసేందుకు అనుమతించింది. జూన్ 30 లోపు ఆయా సంస్థల నుంచి డిగ్రీ పట్టా పొందిన విద్యార్థులకు.. FMGE రాసేందుకు NMC అనుమతి ఇచ్చింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్రం వెల్లడించింది.
FMGE ఫారిన్ మెడికల్ గ్యాడ్యుయేట్ ఎగ్జామ్ అంటే..
విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి భారతదేశంలో ప్రాక్టీస్ చేయాలని భావించే విదేశీ విద్యార్ధులు తప్పనిసరిగా FMGE ఫారిన్ మెడికల్ గ్యాడ్యుయేట్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
రెండేళ్ల మెడికల్ ఇంటర్న్ షిప్
FMGE పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అనంతరం కూడా ఈ విదేశీ వైద్య విద్యార్ధులంతా ఖచ్చితంగా మెడికల్ ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది. రెండేళ్ల పాటు క్లినికల్ ట్రైనింగ్‌కు హాజరు కావలసి ఉంటుందని నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేసింది. రెండేళ్ల పాటు ఖచ్చితంగా ఇంటర్న్ షిప్ పూర్తి చేసుకున్న విదేశీ వైద్య విద్యార్దులకు దేశంలో ప్రాక్టీస్ చేసుకునేందుకు శాశ్వత రిజిస్ట్రేషన్ లభిస్తుందని నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
ప్రస్తుత ఉక్రెయిన్ సంక్షోభ రీత్యా ఇటువంటి వెసులుబాటు కల్పిస్తున్నామని, భవిష్యత్తులో ఇటువంటి వాటికి తావుండని కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
FMGE వెరీ టఫ్
ఫారిన్ మెడికల్ గ్యాడ్యుయేట్ ఎగ్జామ్ చాలా కఠినంగా ఉంటుంది. గత ఏడాది ఉక్రెయిన్ నుంచి వచ్చి ఈ పరీక్షకు హాజరైన 4311 మందిలో కేవలం 26 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా ఈ పరీక్షకు హాజరైన విదేశీ వైద్య విద్యార్ధుల్లో కేవలం 24 శాతంగానే ఉంది.
ఢిల్లీలో ఉక్రెయిన్ విద్యార్ధుల నిరాహార దీక్ష
ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఎంబీబీఎస్ విద్యార్ధులు ఇటీవల ఢిల్లీలో నిరాహార దీక్షకు దిగారు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉక్రెయిన్‌లో చదువుతున్న తామంతా భారతదేశానికి చెందిన పౌరులమేనని, యుద్ధం జరుగుతున్న సమయంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం అక్కడి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారతదేశంలోనే తమ చదువులు కొనసాగేలా చూడాలని వారంతా కోరారు.
ఉక్రెయిన్ నుంచి భారతదేశం తిరిగి వచ్చిన విద్యార్ధులను ఇక్కడ చదివించేందుకు ఎటువంటి సౌకర్యాలు చట్టంలో పొందుపరచలేదని లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఈ విషయం స్పష్టం చేసింది. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ లోక్‌సభలో సమాధానమిచ్చారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన విద్యార్ధులను ఇక్కడ చేర్చుకునేందుకు అనుకూలమైన చట్టాలు లేవని స్పష్టం చేశారు. భారతదేశంలో వైద్యవిద్యను పర్యవేక్షించే నేషనల్ మెడికల్ కమిషన్ ఈ విషయంలో ఎటువంటి అనుమతులు జారీ చేయలేదని మంత్రి క్లారిటీ ఇచ్చారు. గత కొంత కాలంగా భారతదేశంలోనే ఉన్న వైద్య విద్యార్ధులంతా మంత్రి లోక్‌సభలో ఇచ్చిన సమాధానంతో రోడ్డుమీదకు వచ్చారు. నిరాహార దీక్షకు దిగారు.
ఇది శుభవార్తా? కంటి తుడుపు చర్యా?
ఫారిన్ మెడికల్ గ్యాడ్యుయేట్ ఎగ్జామ్ రాసేందుకు కేంద్రం అనుమతి తెలిపడంపై కొందరు పెదవి విరుస్తున్నారు. ఇది తమకు ఏ విధంగాను ఉపయోగం కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని కంటితుడుపు చర్యగా భావిస్తున్నారు. ఫారిన్ మెడికల్ గ్యాడ్యుయేట్ ఎగ్జామ్ రాసేందుకు అనుమతి ఇవ్వడం వల్ల ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్ధుల్లో చాలా కొద్ది మందికి మాత్రమే ఉపయోగం ఉంటుందని మిగతా వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.