Nitish Kumar: థర్డ్ ఫ్రంట్‌లు ఉండవ్… అన్నీ మెయిన్ ఫ్రంట్‌లే…
Nitish Kumar: 2024 ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధం కావాలని బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలంటే దేశంలోని బీజేపీ వ్యతిరేఖ పార్టీలన్ని ఒక్కతాటిపైకి రావాలని, థర్డ్ ఫ్రంట్ అనే మాట ఉండకూడదని, అన్ని కలిసి మెయిన్ ఫ్రంట్‌గా మారితేనే బీజేపీని ఓడించవచ్చని నితీష్ కుమార్ పేర్కొన్నారు. మెయిన్ ఫ్రంట్ దిశగా తాను అడుగులు వేస్తున్నానని, అన్ని పార్టీలను కలిపే ప్రయత్నం చేస్తానని అన్నారు. గత కొన్ని రోజులుగా నితీష్ కుమార్ ప్రతిపక్ష పార్టీల నేతలను వరసగా కలుస్తున్నారు. వారందరినీ సమన్వయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మెయిన్ ఫ్రంట్‌గా పీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరు వినిపిస్తున్నది. అయితే, దీనిని ఆయన కొట్టిపారేశారు. తన లక్ష్యం బీజేపీని గద్దె దించడమేనని, ఆ తరువాత ఏం జరుగుతుందన్నది తరువాత సంగతి అని నితీష్ కుమార్ తెలిపారు. 2020 ఎన్నికల్లో జేడీయుకి తక్కువ సీట్లలో విజయం సాధించడానికి కారణం కూడా బీజేపీనేనని, బీజేపీ నేతలు కుట్రలు చేసి జేడీయుకి తక్కువ సీట్లు వచ్చేలా చేశారని అన్నారు.