N.I.R.F Rankings released: ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్స్ ప్రకటించిన కేంద్రం
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశంలో ఉన్నత విద్యాసంస్థల పనితీరును తెలిపే ర్యాంకులను విడుదల చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ పేరిటి విడుదలైన ఈ జాబితాలో ఐఐటిలు అగ్రస్థానంలో నిలిచాయి. ఐఐటీ మద్రాస్ మొదటి స్థానంలో నిలవగా, ఐఐటి ఢిల్లీ రెండో స్థానంలో, ఐఐటి బోంబే మూడో స్థానంలో నిలిచాయి. కాన్పూర్, ఖరగ్పూర్ ఐఐటిలు నాల్గవ, ఐదవ స్థానంలో నిలిచాయి. గతంలో పోల్చుకుంటే మొదటి ఐదు ర్యాంకింగ్స్ లో ఎటువంటి మార్పులు రాలేదు.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే అనేక విద్యాసంస్థలు తమ ఉనికి చాటుకున్నాయి. ఓవరాల్ ర్యాంకింగ్స్ లో ఐఐటి హైదరాబాద్ 14వ స్థానం సంపాదించుకుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 20వ స్థానంలో నిలిచింది. N.I.T వరంగల్ 45వ స్థానంలో నిలవగా, ఉస్మానియా యూనివర్సిటీ 46వ స్థానంలో నిలిచింది.
యూనివర్సిటీల ర్యాంకింగ్స్
యూనివర్సిటీలకు కేటాయించిన ర్యాంకింగ్స్ ను పరిశీలిస్తే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10వ స్థానంలో, ఉస్మానియా యూనివర్సిటీ 22వ స్థానంలో నిలిచింది.
ఇంజనీరింగ్ విభాగంలో
ఇంజనీరింగ్ విభాగంలో కేటాయించిన ర్యాంకులను పరిశీలిస్తే ఐఐటి హైదరాబాద్ 9వ స్థానం దక్కించుకుంది. గతంలో కంటే ఓ స్థానం దిగజారింది. వరంగల్ నిట్ 21వ స్థానం, ఇంటర్నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ 54వ స్థానంలో నిలిచాయి. JNTU హైదరాబాద్ 76వ స్థానంతో సరిపెట్టుకుంది.
మేనేజ్మెంట్ విభాగంలో
మేనేజ్మెంట్ విభాగంలో చూస్తే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ 73వ ర్యాంకు సాధించగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 94వ స్థానంలో నిలిచింది.
లా విభాగంలో
న్యాయ విద్యను అందించే నల్సార్ యూనివర్సిటీ 4వ స్థానంలో నిలిచింది.
ఫార్మసీ విభాగంలో
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అండ్ రీసెర్చ్ 2వ స్థానంలో నిలిచింది. కాకతీయ యూనివర్సిటీ 44వ స్థానంలో నిలవగా, అనురాగ్ యూనివర్సిటీ 8వ స్థానం దక్కించుకుంది. విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అండ్ రీసెర్చ్ 67వ ర్యాంకులో నిలిచింది. సీఎంఆర్ 72వ స్థానం, గోకరాజు గంగరాజు కాలేజీ 93వ స్థానంలో ఉన్నాయి.
మెడికల్ విభాగంలో ఢిల్లీ ఎయిమ్స్ తొలి స్థానంలో నిలిచింది. వరుసగా ఐదవ సారి ఈ ఘనత సాధించింది. చంఢీఘర్కి చెందిన PGIMER సంస్థ రెండో స్థానంలో నిలవగా, వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ మూడో స్థానంలో నిలిచింది.