New Government will be formed in Karnataka on May 18
కర్ణాటక సీఎం ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లలో ఎవరికి సీఎం పదవి దక్కనుందనే విషయంలో ఇంకా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. బెంగళూర్‌లోని షంగ్రిల్లా హోటల్లో సీఎల్పీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించిన ముగ్గురు కేంద్ర పరిశీలకులు సుశీల్ కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియా సీఎల్పీ సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. తమ నివేదికను అధ్యక్షుడికి అందజేయనున్నారు.
మరోవైపు కర్ణాటక కాంగ్రెస్‌లోని రెండు గ్రూపులు హల్చల్ చేయడం ప్రారంభించాయి. ప్రస్తుతం కర్ణాటకలో పోస్టర్ల ప్రచారం ఊపందుకుంది. తమ నాయకుడినే సీఎం చేయాలని డీకే శివకుమార్, సిద్ధరామయ్య వర్గీయులు భారీ ఎత్తున పోస్టర్లు ప్రదర్శిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో అగ్రనేతల ఫోటోలతో కూడిన పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.
కర్ణాటకలో పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఇరు వర్గాలలో ఒక వర్గం అసంతృప్తితో చెలరేగి పోయే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే వెంటనే రంగంలో దిగేందుకు సిబ్బందిని సమాయత్తం చేశారు.
మే 18న కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు
ఒకవైపు సీఎం అభ్యర్ధి ఎంపికపై కసరత్తు జరుగుతుండగా మరోవైపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
మే 18న కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. భావసారూప్యత కలిగిన పార్టీలను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.