Chopper Crash: ముంబై సముద్రంలో హెలికాప్టర్ లాండింగ్.. ఏమైందంటే?
Chopper Crash: ఇండియన్ నేవీకి చెందిన హెలికాప్టర్ బుధవారం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం జరిగిన క్రమంలో ముంబై తీరానికి సమీపంలో అత్యవసరంగా దాన్ని ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం, హెలికాప్టర్‌లోని ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా రక్షించారు రెస్క్యూ సిబ్బంది. భారత నావికాదళానికి చెందిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్)లో లోపం ఏర్పడినప్పుడు ముంబై నుంచి బయలు దేరిన సదరు హెలికాప్టర్ రాడార్ నుంచి సమాచారం తెగిపోయిందని ఒక అధికారి తెలిపారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వెంటనే దాన్ని వెతకడం ప్రారంభించామని ఆ తరువాత దాన్ని ట్రేస్ చేసి ముగ్గురు సభ్యుల సిబ్బందిని నౌకాదళ పెట్రోలింగ్ క్రాఫ్ట్ సురక్షితంగా రక్షించిందని అన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదని, భారత నౌకాదళం విచారణకు ఆదేశించిందని నేవీ అధికార ప్రతినిధి తెలిపారు. టేకాఫ్ తర్వాత, హెలికాప్టర్లో అకస్మాత్తుగా లోపం ఏర్పడిందని, ఆ వెంటనే వేగంగా క్రిందికి రావడం ప్రారంభించిందని అధికారులు వెల్లడించారు. అత్యవసర పరిస్థితిని గమనించిన పైలట్ హెలికాప్టర్‌ను నీటిలో దించాడని తెలుస్తోంది.