National Voters Day: నేషనల్ ఓటర్స్ డే గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
National Voters day is celebrated in India on January 25th every year
భారతదేశంలో ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఐదేళ్ల కొకసారి లోక్ సభ ఎన్నికలు కూడా తప్పనిసరిగా జరుగుతూనే ఉంటాయి. ఎన్నికల సమయంలో ప్రతి చోటా సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. రాజకీయ నాయకుల ప్రసంగాలు, అభిమానులు చేసే కార్యక్రమాలు, పోస్టర్లు, ప్రచార వాహనాల సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ సందడి వాతావరణం కనిపిస్తుంది.
ఇంత ఆర్భాటంగా జరిగే ఎన్నికలకు చాలా మంది దూరంగా ఉంటున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. దీంతో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గుతోంది. ఈ లోపాన్ని గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో మరింత విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలని భావించింది. ప్రతి ఏటా ఓటర్స్ డే సెలబ్రేట్ చేయాలని నిర్ణయించింది. జనవరి 25వ తేదీని ఓటర్ల దినోత్సవంగా పరిగణించాలని భావించింది.
2011 నుంచి ప్రతి ఏటా జనవరి 25వ తేదీన నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఎన్నికల్లో తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతి ఓటరుకు ఓసారి గుర్తుచేయడం నేషనల్ ఓటర్స్ డే ప్రధాన ఉద్దేశ్యం. భారతదేశంలో కేంద్ర ఎన్నికల సంఘం 1950 జనవరి 25 నుంచి పనిచేయడం ప్రారంభించింది. ఆ తేదీను మరోసారి దేశ ప్రజలకు గుర్తుచేసే విధంగా అదే రోజు ప్రతి ఏడాది ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉండగా..అప్పటి న్యాయ మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఎన్నికల సంఘం 2011 నుంచి నేషనల్ ఓటర్స్ డే క్రమం తప్పకుండా ప్రతి ఏటా నిర్వహిస్తోంది. 18 ఏళ్ల వయసు నిండినవారు చాలా మంది తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడం లేదని గ్రహించిన అప్పటి పాలకులు ఓటర్స్ డే ద్వారా చైతన్యం కలిగించాలని నిర్ణయించారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.
యువ ఓటర్లే భారత ప్రజాస్వామ్యపు భవిష్యత్తు అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి పేర్కొన్నారు. ఓటింగ్ వయస్సు వచ్చేలోగా విద్యార్ధుల్లో ప్రజాస్వామ్య విలువలు గురించి అవగాహన కల్పించాలని ఆకాంక్షించారు.
ప్రధాని నరేంద్ర మోడీ కూడా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే నినాదం బాగుందని తెలిపారు. ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేద్దామని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
Greetings on National Voters’ Day. Inspired by this year’s theme of ‘Nothing Like Voting, I Vote For Sure’, may we all work together to further strengthen active participation in elections and strengthen our democracy. I also laud ECI for their efforts in this area. @ECISVEEP
— Narendra Modi (@narendramodi) January 25, 2023