National Herald Case: నేడు మరోసారి ఈడీ ముందుకు రాహుల్ గాంధీ… నిన్న 11 గంటలు పైగా విచారణ…
నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలను విచారించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఇప్పటికే నాలుగు రోజులపాటు విచారించింది ఈడీ. నేడు ఐదోవ రోజు కూడా విచారణకు రావాలని ఆదేశించింది. నేడు ఉదయం11 గంటలకు రాహుల్ గాంధీ ఈడి ముందు హాజరు కానున్నారు. నాలుగు రోజుల్లో 40 గంటలకు పైగా రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించారు. నిన్న రెండు విడతలుగా రాహుల్ గాంధీని అధికారులు విచారించారు.
నిన్న ఉదయం మూడున్నర గంటల పాటు విచారణ జరగ్గా, సాయంత్రం 4.30 గంటల నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు విచారణ జరిగింది. నిన్న మొత్తం పదకొండున్నర గంటల పాటు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇక ఈనెల 23న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఈడీ ముందు హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాగాంధీ కి సమన్లు పంపినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నది.