MLC Kavitha: ఈడీ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తా – ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha attacks PM Modi in Delhi
ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు సిద్ధమయ్యారు. మార్చి 11న విచారణకు హాజరౌతానని, ఈడీ ఏం అడిగినా సమాధానం చెబుతానని, విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కవిత అనేక విషయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
మహిళా రిజర్వేషన్ల కోసం రేపు దీక్ష
మహిళా రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వాలు మాట నిలబెట్టుకోలేదని కవిత అన్నారు. 27 ఏళ్లుగా మహిళా బిల్లు కోసం చర్చ జరుగుతోందని..ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదని కవిత గుర్తుచేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు దీక్ష కొనసాగుతుందని కవిత తెలిపారు. తాము చేపడుతున్న ఈ దీక్షకు 18 పార్టీల నుంచి నాయకులు వస్తున్నారని కవిత తెలిపారు. తాము చేపడుతున్న దీక్ష మహిళా రిజర్వేషన్లు సాధించడానికి చేపడతున్న తొలి కార్యక్రమమని, భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకం చేపడతామని కవిత స్పష్టం చేశారు.
సోనియాకు ధన్యవాదాలు
రాజ్యసభలో బిల్లు తెచ్చినందుకు సోనియాకు ధన్యవాదాలు తెలిపారు. చాలా కాలంగా మహిళా బిల్లును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారని కవిత గుర్తుచేశారు. అధికారంలోకి వస్తే మహిళా బిల్లు తెస్తామని మోడీ హామీ ఇచ్చారని, ఆ హామీ నిలబెట్టుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
సుప్రీంకు వెళ్తా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు అందాయని ,ఈడీ విచారణకు సహకరిస్తానని కవిత తెలిపారు. దర్యాప్తు సంస్థలు ఇంటికి వచ్చి మహిళను విచారించాలని చట్టం చెబుతోందని, వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా విచారించాల్సిన అవసరం ఉందని కవిత గుర్తుచేశారు. తనతో పాటు ఎవరిని విచారించినా అభ్యంతరం లేదని కవిత స్పష్టం చేశారు. కావాలంటే నిందితులను ఇంటికి తీసుకొచ్చి విచారించమని ఈడీ అధికారులను కోరానని కూడా కవిత గుర్తుచేశారు. తన విన్నపాన్ని ఈడీ అధికారులు తిరస్కరించారని, తప్పని సరిగా వ్యక్తిగతంగా విచారణకు రావాల్సిందేనని ఈడీ అధికారులు చెప్పిన విషయాన్ని కవిత గుర్తుచేశారు. దర్యాప్తు సంస్థలపైన ప్రభుత్వం ఒత్తిడి అర్దం చేసుకోగలనని కవిత అన్నారు. దర్యాప్తు సంస్థలు మహిళలను విచారిందే విధానంపై సుప్రీంకు వెళ్తామని కవిత ఈ సందర్భంగా కవిత వెల్లడించారు.