Margaret Alva: ప్రజాసమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదు
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరెట్ ఆల్వా తప్పుబట్టారు. తన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ధరల పెరుగుదల అంశాన్ని ఉభయ సభల్లో ప్రస్తావనకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని అన్నారు. పార్లమెంట్లో జరగాల్సిన చర్చలనుంచి ప్రభుత్వం తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తోందని, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లేనని మార్గరెట్ ఆల్వా అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో ప్రజాసమస్యలను ప్రస్తావించే ఎంపీలను సభ నుంచి బహిష్కరించడం సరికాదని ఆల్వా తెలిపారు. ఎంపీలను సభ నుంచి బహిష్కరించినంత మాత్రాన ప్రభుత్వ బాధ్యత తీరిపోదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో సమస్యలు మరింత జఠిలంగా మారుతాయని ట్వీట్ చేశారు.
To escape a debate in Parliament on inflation & prices by hiding behind an indisposed FM, makes a mockery of the ‘collective responsibility’ of the Council of Ministers. Suspending protesting MPs won’t fix the accountability problem in Govt. It will only deepen fault lines.
— Margaret Alva (@alva_margaret) July 27, 2022
మార్గరెట్ ఆల్వా ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలో దిగారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలైన ఆమెను విపక్షాలన్నీ ఎన్నికల బరిలో దించాయి. ఎన్డీఏ అభ్యర్ధి ధన్కర్ను ఆమె ఎన్నికల్లో ఎదుర్కోనున్నారు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న ఆమెకు అన్ని పార్టీలలోను స్నేహితులు ఉన్నారు. వారిలో బీజేపీకి చెందిన నేతలు కూడా ఉన్నారు. ఎన్నికలలో తనను మద్దతు ఇవ్వాలని వారికి ఆమె ఫోన్ చేసి కోరారు. అలా చేసిన కొద్ది గంటలకే ఆమె ఫోన్ సరిగ్గా పనిచేయడం మానేసింది. ఆమె చేస్తున్న కాల్స్, ఆమెకు వస్తున్న కాల్స్ డైవర్ట్ అవ్వడం మొదలయ్యాయి. దీంతో ఆమె బీఎస్ఎన్ఎల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ను కొందరు ట్యాపింగ్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దాదాపు ఓ రోజు తర్వాత ఆమె ఫోన్ సేవలు పునరుద్ధరించబడ్డాయి.