Manish Sisodia: సీబీఐ కస్టడీకి మనీశ్ సిసోడియా
Manish Sisodia: లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచింది సీబీఐ. ఈ కేసులో ఆయనను విచారించేందుకు ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరింది. సీబీఐ వాదనలకు ఏకీభవించిన న్యాయస్థానం మనీశ్ సిసోడియాకు ఐదు రోజుల కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మనీశ్ సిసోడియాను ఆదివారం సీబీఐఅరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తమ వద్ద ఉన్న ఆధారాలకు సిసోడియా చెబుతున్న సమాధానాలకు పొంతన కుదరడం లేదని, తప్పించుకొనేలా సమాధానాలు చెబుతున్నారని, మద్యం పాలసీ కేసులో పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు ఆయనను కస్టడీకి అప్పగించాలని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దాదాపు గంటసేపు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకే నాగ్‌పాల్ తీర్పును రిజర్వ్ చేశారు. దీంతో ఐదు రోజులపాటు మార్చి 4వ తేదీ వరకు మనీశ్ సిసోడియా సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు. కాగా ఈ కేసులో సిసోడియాతో పాటు పలువురు కీలక నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ లాబీ కోరికల మేరకు సవరణలు చేయడంతో కనీసం రూ. 100కోట్లు విలువ చేసే నిధులు అక్రమంగా చేతులు మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ కేసులో మొన్నటివరకు కీలకనేతలను విచారించిన సీబీఐ ఇప్పుడు అరెస్టులను మొదలుపెట్టింది. ఇప్పుడు మరోకీలకనేత త్వరలో అరెస్ట్ కాబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.