Manish Sisodia: సీబీఐ అరెస్ట్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీశ్ సిసోడియా
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఐదు రోజుల రిమాండ్‌ను విధించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. ఫలితంగా.. మార్చి 4వ తేదీ వరకు మనీశ్ సిసోడియా సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు. అయితే ఇందులో తన ప్రమేయం ఏమిలేదని సిసోడియా అంటున్నారు. కావాలనే ఇందులో ఇరికించారని తెలిపారు. ఆదివారం దాదాపు 8 గంటల పాటు సిసోడియాను విచారించిన సీబీఐ దర్యాప్తులో సరైన సమాధానాలు ఇవ్వడం లేదంటూ ఆయన్ని ఆదివారం అరెస్ట్ చేసింది. సోమవారం ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ న్యాయస్థానంలో హాజరు పరుచగా ఐదు రోజుల రిమాండ్ ను విధించింది ధర్మాసనం.
మద్యం కుంభకోణంలో సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు సిసోడియా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందిస్తూ సుప్రీంకోర్టుకు వచ్చే ముందు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. దీనికి సిసోడియా తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. జర్నలిస్ట్ వినోద్ దువా కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను ప్రస్తావించారు. కోవిడ్ ను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వంపై దువా చేసిన విమర్శల కేసులో ఆయన నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చారని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన సీజేఐ ఈరోజు మధ్యాహ్నం 3.50 గంటలకు విచారణ చేపడతామని తెలిపింది.