మణిపూర్ హింసకాండకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్ హింసాకాండకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు చేస్తున్న కేసులను పొరుగు రాష్ట్రమైన అస్సాంకు (Assam) బదిలీ చేసింది.
Supreme Court: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో (Manipur) హింసాకాండ కొనసాగుతూనే ఉంది. నాలుగు నెలల నుంచి మణిపూర్ అట్టుడికిపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఎన్ని కేసులు నమోదవుతున్నప్పటికీ.. హింస మాత్రం చల్లారడం లేదు. ఈక్రమంలో మణిపూర్ హింసకాండకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్ హింసాకాండకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు చేస్తున్న కేసులను పొరుగు రాష్ట్రమైన అస్సాంకు (Assam) బదిలీ చేసింది.
అల్లర్లు, విధ్వంసం, హింసకు సంబంధించి నమోదయిన కేసులను మణిపూర్‌లో కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లో విచారణ జరపాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు మణిపూర్‌కు సంబంధించిన కేసుల విచారణ అస్సాంలో జరపాలని సుప్రీంకోర్టు అధికారులకు సూచించింది. ఇందుకోసం న్యాయమూర్తులను ఎంపిక చేయాలని గువాహటి హైకోర్టును ఆదేశించింది. అలాగే నిందితులను కోర్టుముందు హాజరుపరచడం, రిమాండ్, జ్యుడీషియల్ కస్టడీ వంటివి ఇక నుంచి గువాహటిలోని కోర్టు నుంచి ఆన్‌లైన్‌లో జరుగుతాయని సుప్రీంకోర్టు వెల్లడించింది. బాధితులు, సాక్షులకు ఆన్‌లైన్‌లో ఇష్టం లేకపోతే నేరుగా గువాహటి కోర్టుకు వెళ్లి హాజరు కావచ్చని పేర్కొంది.