UnParliamentary Words:ఎంపీలు వాడే పదాలకు కత్తెర, నిషేధిత పదాల జాబితా విడుదల
పార్లమెంట్లో ఎంపీలు ఉపయోగిస్తున్న భాషపై దేశ వ్యాప్తంగా కొన్ని అభ్యంతరాలు తలెత్తాయి. టీవీలలో ప్రత్యక్ష ప్రసారాలు చూసే సందర్భంగా ఎంపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే సమయంలో సంయమనం కోల్పోయి మాట్లాడడం మనం అనేకసార్లు చూశాం. దీనిపై అనేక మంది మేధావులు సైతం తమ నిరసనను తెలిపారు. ఎంపీలు కాస్త హుందాగా వ్యవహరించాలని కూడా సూచించారు. ఈ నేపథ్యంలో వారు ఉపయోగించే కొన్ని పదాలపై లోక్‌సభ సచివాలయం కత్తెర వేసింది. తాజాగా ఓ జాబితా విడుదల చేసింది. ఆ యా పదాలను ఇక నుంచి ఎంపీలు వినియోగించరాదని కోరింది.
త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమౌతున్న వేళ లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించిన పదాల కత్తెరపై సర్వత్రా చర్చ ప్రారంభమయింది.
జుమ్లాజీవి (JumlaJeevi), బాల్బుద్ధి(Bal Budhi), కోవిడ్ స్పెడర్(Covid Spreader), స్నూప్ గేట్(Snoop Gate) వంటి పదాలను ఇక నుంచి ఉపయోగరాదని లోక్‌సభ సెక్రటేరియట్ ఎంపీలను కోరింది. వీటితో పాటు డ్రామా (Drama), కరప్ట్ (Corrupt), హిపోక్రసీ (Hypocracy), బిట్రేయ్డ్ (Betrayed), ఎబ్యూస్డ్ (abused), ఇన్‌కాంపిటెంట్ (Incompitenent) వంటి పదాలను అన్ పార్లమెంటరీ పదాలుగా వ్యవహరించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
లోక్‌సభ సెక్రటేరియట్ నిషేధించిన మరికొన్ని పదాలు
అనార్కిస్ట్ (anarchist), శకుని, డిక్టేటోరియల్(Dictatorial) తానాషా (Taanashah), తానాషీ (Taanashahi), జై చంద్ (Jai Chand), వినాష్ పురుష్ (Vinash Purush), ఖలిస్తానీ (Khalistani), ఖూన్ సే ఖేతీ (Khoone Se Kheti), దోహ్రా చరిత్ర (Dohra Charitra), నికమ్మ (Nikamma), నౌటంకీ (nautanki), ధిందోరా పీట్నా (Dhindora Peetna), బెహరీ సర్కార్ (Behri Sarkar) వంటి పదాలు ఇక నుంచి ఎంపీలు వినియోగరాదని లోక్‌సభ సచివాలయం కోరింది.
రాజ్యసభ సమావేశాలు, లోక్‌సభ సమావేశాలు జరిగే సమయంలో ఎంపీలు వాడిన పదాలను రికార్డుల నుంచి తొలగించే అధికారం రాజ్యసభ చైర్మన్‌కు, లోక్‌సభ స్పీకర్‌కు ఉన్నాయి. వారి మాటే ఫైనల్. వారి నిర్ణయం ప్రకారమే పదాలను రికార్డుల నుంచి తొలగిస్తారు.