Lalu Prasad Yadav: కోర్టుకు హాజరైన లాలూ దంపతులు
Lalu Prasad Yadav: 2008 నాటి రైల్వే ఉద్యోగాల కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో తాజాగా ఆయనకు, ఆయన భార్య రబ్రీదేవికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఆయన కుమార్తె మీసా భారతితో పాటు మరో 11 మంది నిందితులకు కూడా సమన్లు పంపింది. మార్చి 15వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. ఈ కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి నేడు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు హాజరయ్యారు.
రైల్వే ఉద్యోగార్థులు తమ భూములను లాలూ కుటుంబ సభ్యులకు అమ్మడం కానీ, బహుమతిగా ఇవ్వడం జరిగిందని అందుకు ప్రతిఫలంగా వారు రైల్వే ఉద్యోగాలను పొందారని సీబీఐ ఆరోపిస్తోంది. లాలూ 2004-2009 మధ్య కాలంలో రైల్వే మంత్రిగా పని చేసిన కాలంలో ఈ భారీ కుంభకోణం జరిగినట్లు పేర్కొంది. మరోవైపు ఇటీవలే సింగపూర్ లో లాలూ ప్రసాద్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి వచ్చిన ఆయనకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.