Ramnath Kovind: రేపటితో ముగియనున్న కోవింద్ పదవీకాలం
President Ram Nath Kovind’s Last Speech: భారత రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్లో రామ్ నాథ్ కోవింద్‌కు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి హోదాలో తన చివరి సందేశాన్ని వెలువరించారు. రాజకీయాలకు అతీతంగా దేశాభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షించారు. జాతీయ ప్రయోజనాల కోసం పక్షపాత రాజకీయాలను అధిగమించాలని పిలుపునిచ్చారు. ప్రజాసంక్షేమానికి ఏది అవసరమో నిర్ణయించుకోవాలని రాజకీయ పక్షాలకు సూచించారు.
పార్లమెంటును కోవింద్ ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించారు. ఉభయ సభల్లో చర్చలు జరిపేటప్పుడు సభ్యులు గాంధేయవాదాన్ని అనుసరించాలని ఆయన హితవు పలికారు. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. ఆమె మార్గదర్శనంలో దేశం లబ్ది పొందాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.
తాను అందరికీ వీడ్కోలు పలుకుతున్న వేళ తన గుండెల్లో ఎన్నో పాత జ్ఞాపకాలు మెదులుతున్నాయన్నారు రామ్‌నాథ్ కోవింద్. సెంట్రల్ హాల్లో 5 ఏళ్లుగా చాలా మంది ఎంపీలతో చిరస్మరణీయ క్షణాలు గడిపానని పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం ఇదే హాల్లో తాను ప్రమాణం చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఐదేళ్లపాటు తాను తీసుకున్న అనేక కీలక నిర్ణయాలకు అందరి సహకారం ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వివరించారు. ఇదే సమయంలో తన హృదయంలో ఎంపీలందరికీ ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.
మరోవైపు పార్లమెంట్ సభలు సజావుగా సాగితేనే దేశ ప్రజలకు అందాల్సిన ఫలాలు అందుతాయన్నారు రాష్ట్రపతి. ప్రజా ప్రతినిధులు సభలను సజావుగా జరిగేలా చూడాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్క సభ్యుడు ఉభయ సభల్లో తమ ఆలోచనలను వివరించాలన్నారు. సభల్లో ఆందోళనలు చేసి సభ జరగకుండా అడ్డుపడటం సభకు, దేశానికి మంచిది కాదన్నారు. కాగా రాష్ట్రపతి వీడ్కోలు కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.