ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఖలిస్థానీ రాతలు కలకలం సృష్టించాయి. మొత్తం 5 స్టేషన్‌లలో ఖలీస్థానీకి మద్ధతుగా స్ప్రేతో నినాదాలు రాశారు.
Delhi: ఖలిస్థానీ (Khalistan) మద్ధతుదారుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. కొద్దిరోజులుగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇండిన్ ఎంబసీలు, హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారు. ఇటు దేశంలో కూడా అక్కడక్కడా అలజడి సృష్టిస్తున్నారు. పంజాబ్ (Punjab), ఢిల్లీ (Delhi) రాష్ట్రాల్లో అల్లర్లు.. హింసకు పాల్పడుతున్నారు. తాజాగా ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్లలో (Metro Stations) ఖలిస్థానీ రాతలు కలకలం సృష్టించారు. జీ 20 (G 20 Summit) సమావేశాలకు ముందు ఖలిస్థానీ మద్ధతుదారులు ఈ రాతలు రాయడం వివాదాస్పదంగా మారింది.
ఢిల్లీలోని శివాజీ పార్క్ మెట్రో స్టేషన్ నుంచి పంజాబీ బాగ్ వరకు ఉన్న పలు స్టేషన్లలోని గోడలపై.. గ్రాఫిటీతో ఖలీస్థానీకి మద్ధతుగా నినాదాలను రాశారు. మొత్తం ఐదు మెట్రో స్టేషన్లలో ఖలీస్థానీ రాతలు కనిపించాయి. సిఖ్ ఫర్ జస్టిస్ పేరుతో ఖలిస్థాన్‌కు అనుకూలంగా ఈ రాతలు రశారు. మెట్రో సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు. దేశ వ్యతిరేకమైన ఈ ఘటనపై విచారణ జరిపి.. వెంటనే నిందితులను అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. అటు గోడలపై రాసిన రాతలను చెరిపివేశామని అన్నారు.