Khalistan Posters in Delhi: ఢిల్లీలో ఖలిస్తానీ పోస్టర్ల కలకలం… కేసులు నమోదు
Khalistan Posters in Delhi: జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సెక్యూరిటీని పెంచారు. ఈ సమయంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఖలిస్థానీ పేరుతో పోస్టర్లు ఏర్పాటు కావడం సంచలనంగా మారింది. ఖలిస్థానీ జిందాబాద్, రెఫరెండం 2020, సిక్కులకు న్యాయం చేయాలి అంటూ పోస్టర్లు వెలిశాయి. ఢిల్లీలోని వికాస్‌పురి, జనక్‌పురి, పశ్చిమ విహార్, పీరాగర్హి వంటి ప్రాంతాల్లో ఇలాంటి పోస్టర్లు వెలవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
పోలీసులతో పాటు ఉగ్రవాద నిరోధక విభాగం అధికారులు సైతం రంగంలోకి దిగి పోస్టర్లను ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమౌతున్నారు. వివాదాస్పద పోస్టర్లను ఏర్పాటు చేసిన వారిపై పలు రకాల ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే రిహార్సిల్స్ జరుగుతున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రాబోయే రోజుల్లో ఢిల్లీలో మరిన్ని అంతర్జాతీయ వేడుకలకు వేదిక కానున్నది. దీంతో ఢిల్లీని శతృదుర్భేద్యంగా మార్చేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.