ED: ఈడీ కార్యాలయానికి చేరిన కవిత, విచారణ ప్రారంభించిన అధికారులు
Kavitha ED interrogation Started in the Second Floor
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత విచారణ ప్రారంభం అయింది. ఐదుగురు అధికారుల బృందం కవితను విచారిస్తున్నారు. ఈడీ కార్యాలయంలో సెకండ్ ఫ్లోర్ లో ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఈడీ జాయింట్ డైరెక్టర్ సహా ఇతర సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. రామచంద్ర పిళ్లై సమక్షంలో కవితను విచారించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.
కవిత విచారణ ప్రారంభానికి ముందు అనేక పరిణామాలు జరిగాయి. ఢిల్లీలో కేసీఆర్ నివాసానికి వందలాది మంది గులాబీ నేతలు చేరుకున్నారు. కవితకు సంఘీభావం ప్రకటించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఢిల్లీ చేరుకుని కవితకు అండగా నిలిచారు.
మరోవైపు సీఎం కేసీఆర్ ఈడీ విచారణపై ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. నిరాధార ఆరోపణల ద్వారా తమ పార్టీ నేతలను తీవ్రంగా వేధిస్తున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు.
హైదరాబాద్ నగరంలో పలు చోట్ల మోడీ వ్యతిరేక పోస్టర్లు వెలిశాయి. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో పోస్టర్ల ద్వారా కొందరు గులాబీ నేతలు తమ నిరసన తెలియజేశారు. బాయ్ బాయ్ మోడీ అనే పోస్టర్లు నగరంలోని పలు చోట్ల వెలిశాయి.