Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (Dk Shivakumar), మాజీ ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో (Basavaraj Bommai) సమావేశమయ్యారు. ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం ఆ ఇద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
డీకే శివకుమార్ సమావేశాలకు హాజరయ్యే ముందు అసెంబ్లీ ఎంట్రెన్స్ దగ్గర ప్రణమిల్లి సమావేశానికి హాజరయ్యారు. ఇక అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్వీ దేశ్ పాండే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత ఆ రాష్ట్ర గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ ఆర్వీ దేశ్ పాండే వారిచేత ప్రమాణం చేయిస్తున్నారు. ఆ తర్వాత స్పీకర్ను ఎన్నుకోనున్నారు.
కాగా, మే 10 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. మొత్తం 224 స్థానాలకు గానూ 135 స్థానాల్లో గెలుపొందింది. శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.