Karnataka: కర్ణాటకలో లంచం తీసుకుంటూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు
Karnataka: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ కుమార్ లంచ తీసుకుంటూ దొరికిపోయాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో లోకాయుక్త పోలీసులు సోదాలు చేసి రూ.6 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా ప్రశాంత్ పని చేస్తున్నారు. గతంలో ఈయన ఏసీబీ లో పనిచేసారు. అవినీతి పరులను పట్టుకున్న ఈయన చివరికి అవినీతిపరుడు అనే ముద్ర వేసుకున్నాడు.
అయితే ప్రశాంత్ కర్ణాటక బిజెపి ఎమ్మెల్యే కుమారుడు కావడంతో కర్ణాటకలోని ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేఎస్‌డీఎల్‌కు విరూపాక్షప్ప చైర్మన్‌గా ఉన్నారని.. ప్రశాంత్ తన తండ్రి తరపున లంచం తీసుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు.ప్రశాంత్ పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూఅధికారులకు పట్టుబడిన నేపథ్యంలో..కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై స్పందించారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వం యుద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్ ను విమర్శించారు. అవినీతి అభియోగాల నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్న సమయంలో లోకాయుక్తను రద్దు చేసినట్టు బొమ్మై చెప్పారు.
అవినీతికి పాల్పడే వారు ఎవరైనా కానీ, పార్టీలతో సంబంధం లేకుండా విడిచి పెట్టం. నిందితుడు, అతడితోపాటు పట్టుబడిన డబ్బుపై లోతైన దర్యాప్తు చేస్తాం. కాంగ్రెస్ తన హయాంలో లోకాయుక్తను మూసివేస్తే.. మేము అధికారంలోకి వచ్చాక తిరిగి తెరిచాం. చాలా మంది కాంగ్రెస్ నాయకులు తప్పించుకున్నారు. ఇది అవినీతికి వ్యతిరేకంగా మేము చేస్తున్న పోరాటం అని వివరించారు. మరోవైపు ఎమ్మెల్యే విరూపాక్షప్ప ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి లేఖ రాశారు. తన కుటుంబంపై కుట్ర జరుగుతోందన్నారు. తనపై ఆరోపణలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ కేఎస్‌డీఎల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు.