BJP-TDP Alliance: బీజేపీ-టీడీపీ కూటమి అద్భుతమైన విజయం.. నడ్డా ట్వీట్ వైరల్!
BJP-TDP Alliance: బీజేపీ-టీడీపీ కూటమి అద్భుతమైన విజయం సాధించిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అదేంటి తెలుగు రాష్ట్రాల్లో టీడీపీతో బీజేపీ పొత్తులు ప్రస్తుతానికి ఏమీ లేవుకదా అనే డౌట్ మీకు కలగొచ్చు. అవును నిజమే ఇక్కడ అయితే లేవు కానీ అండమాన్ నికోబార్ దీవుల్లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. పోర్టు బ్లెయిర్ లో గత ఏడాది జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ 10, టీడీపీ 2 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీకి టీడీపీ మద్దతు తెలిపింది. దీంతో మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఆ కూటమికి దక్కింది, ఈ క్రమంలోనే ముందు బీజేపీ అభ్యర్థి, ఆ తర్వాత టీడీపీ అభ్యర్థికి చైర్మన్ పదవి దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా టీడీపీ అభ్యర్థికి బీజేపీ మద్దతు తెలపడంతో టీడీపీకి ఛైర్మన్ పదవి దక్కింది. ఈ కూటమి విజయం సాధించడంతో జేపీ నడ్డా ట్వీట్ చేస్తూ పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించినందుకు బీజేపీ-టీడీపీ కూటమికి అభినందనలు అని పేర్కొన్నారు. ఈ విజయం ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్న ఆయన పోర్ట్ బ్లెయిర్ ప్రజల కోసం అంకితభావంతో పనిచేశామని, అవి ఫలించాయని అన్నారు.