‘ఐ లవ్ ఢిల్లీ’ కాదు.. ‘ఢిల్లీ లవ్ యూ’..
నార్త్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఒక సెల్ఫీ పాయింట్ బాగా ఫేమస్. అక్కడ ‘ఐ లవ్ ఢిల్లీ’ అనే అక్షరాలను అమర్చి ఉంచారు. ఆ అక్షరాల్లో లవ్ అనే పదానికి బదులు హార్ట్ షేప్ బొమ్మ పెట్టారు. అందుకే అక్కడ చాలా మంది ఫొటోలు దిగుతుంటారు. ఎక్కువ సమయం గడుపుతుంటారు. అయితే ఆ ‘గుండె’ను ఈ మధ్య ఎవరో దొంగిలించారు. దీంతో ఎంతో మంది ఫీలయ్యారు. ఆ దొంగోణ్ని పట్టుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో పోలీసులను రిక్వెస్ట్ చేశారు. కానీ ఆ దొంగ ఇంకా దొరకలేదు. ఈ నేపథ్యంలో మరో వ్యక్తి అదే ప్లేసులో అట్టముక్కతో చేసిన హృదయాకారాన్ని తెచ్చిపెట్టాడు. దీంతో పలువురు నెటిజన్లు అతణ్ని మెచ్చుకుంటున్నారు. ‘దిల్లున్నోడు’ అంటూ పొగుడుతున్నారు. అయితే ఆ పేపర్ హార్ట్ పై అతను రాసిన వాక్యం మరింత ఆకట్టుకుంటోంది. ‘హృదయం ఎలాంటిదైనా హృదయమే.. ప్లాస్టిక్ అయినా పేపరైనా’ అని రాశాడు. దీనిపై స్పందించిన మరికొందరు ‘ఐ లవ్ ఢిల్లీ కాదు. ఢిల్లీ లవ్ యూ’ అని కామెంట్లు పెడుతున్నారు.