IT raids on real estate firms: హైదరాబాద్, బెంగళూర్‌లో ఐటీ దాడులు
ఆదాయపు పన్ను శాఖ జోరు పెంచింది. హైదరాబాద్, బెంగళూర్‌లో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు పన్నులు ఎగ్గొట్టాయనే అభియోగాలతో దాడులు జరిపింది. సెర్చ్ అండ్ సీజన్ ఆపరేషన్ ద్వారా అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది. హైదరాబాద్, బెంగళూర్‌తో పాటు చెన్నైలోని కొన్ని పాంతాల్లో కూడా దాడులు చేసింది. మొత్తంగా 40 ప్రదేశాలలో చేసిన దాడుల్లో లెక్కాపత్రాలు లేని కోట్ల విలువైన సంపద లభ్యమయింది. కేంద్ర ఆర్ధిక శాఖ ఈ వివరాలను వెల్లడించింది. మూడున్నర కోట్ల నగదు, 18.50 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం, వెండి సామాన్లు లభించినట్లు అధికారులు తెలిపారు.
ఐటీ అధికారులు దాడి చేసిన సంస్థలు తమ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని పలు రంగాలకు విస్తరించింది. నిర్మాణ రంగం, స్థలాల అమ్మకాలు, కొనుగోలు, వాణిజ్య సముదాయాలను, నివాసయోగ్య స్థలాలను లీజుకు ఇచ్చే వ్యాపారంలోను ఉన్నాయి. వీటితో పాటు విద్యారంగం, వైద్య రంగాలలో సైతం పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు.
నగదు, నగలుతో పాటు విలువైన పత్రాలు, డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీన పరుచుకున్నారు. వాటి ద్వారా మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
హైదరాబాద్, బెంగళూర్‌లో ఉన్న సంస్థలు కొంత కాలంగా కలిసి జాయింట్ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ద్వారా తన ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తున్నాయి. వీటికి సంబంధించిన కొన్ని ఆధారాలు లభించినా, ఏ స్థాయిలో ఆర్ధిక లావాదేవీలు జరుగుతున్నాయో అధికారులు ఓ అంచనాకు రాలేకపోతున్నారు. మరిన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే పూర్తి స్థాయిలో విషయాలు వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి మధ్య జరిగిన లావాదేవీలు దాదాపుగా 400 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని కేంద్ర ఆర్ధిక శాఖ అంచనా వేసింది. రెండు కంపెనీలు కూడా ఆదాయ పన్ను ఎగవేసినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ లావాదేవీల అంశాన్ని మరింత లోతుగా విచారిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ వెల్లడించింది. ఆలిండియా రేడియో న్యూస్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేసింది.