Draupadi Murmu: భారత్ ప్రయాణం ఎన్నో దేశాలకు స్ఫూర్తిదాయకం
Draupadi Murmu Speech : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రిపబ్లిక్ డే సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించగా ఆమె మాట్లాడిన వివరాలు మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ద్రౌపది ముర్ము మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ తో పాటు మిగిలిన మేధావులందరూ మనకు సరైన మార్గనిర్దేశాన్ని, నైతిక విలువలతోకూడిన చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవడం మనందరి బాధ్యత అని, మనం ఇప్పటివరకూ వాళ్ల అంచనాలకు అనుగుణంగానే నడుచుకుంటూ వచ్చామని ఆమె పేర్కొన్నారు. మన రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన మన నాగరికత, అధునికతరం అభివృద్ధి భావనలు కలగలసిన సరికొత్త రూపంలో అవతరించిందని ద్రౌపది ముర్ము అన్నారు. ఇక ఈ రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన వ్యక్తి, అత్యంత సంక్లిష్టమైన కార్యాన్ని నెరవేర్చి, దానికి తుది రూపును దిద్దిన శక్తి అయిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కి ఈ దేశం ఎప్పటికీ ఋణపడి ఉంటుందని ముర్ము పేర్కొన్నారు. రాజ్యాంగ ప్రాధమిక ప్రతిని తయారుచేసిన న్యాయ నిపుణుడైన బి.ఎన్.రాయ్ ని, ఇతర అధికారులను, మేధావులను కూడా మనం నేడు గుర్తు చేసుకోవాలనన్న ఆమె, రాజ్యాంగ నిర్మాణ సభలోని వ్యక్తుల్లో ఈ దేశంలోని అన్ని మతాలకూ, వర్గాలకూ చెందిన వారు ఉండడం, వారిలో 15 మంది మహిళలు కూడా ఉండడం మనకి గర్వకారణమని ముర్మూ పేర్కొన్నారు. ఇక విప్లవయోధులు, సంస్కర్తలు దూరదృష్టి కలిగినవారితో, ఆదర్శవంతులతో చేతులు కలిపి మన శాంతి, సౌభ్రాతృత్వం, సమానతలకు నిలయమైన మన సంస్కృతియొక్క గొప్పదనాన్ని మనకి తెలియజెప్పారని కూడా ఆమె అన్నారు. స్వతంత్ర భారత నిర్మాణానికి హేతువులైనవారు, అభివృద్ధికి దోహదపడే విదేశీ ఆలోచనలను సైతం స్వీకరించారని, వాళ్లు “ఆ నో భద్రాః క్రతవే యన్తు విశ్వతః” అన్న మన వైదిక ధర్మ సూత్రాన్ని పాటించారని ఈ సందర్భంగా ఆమె అన్నారు. మంచి ఆలోచనలు ఎక్కడినుంచి వచ్చినా సరే స్వీకరించాలని దీనికి అర్థమని, మన రాజ్యాంగం సుదీర్ఘమైన, సుదృఢమైన ఆలోచనా సరళికి వేదికై నిలచిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.