Five Day Banks: బ్యాంకులు వారానికి ఐదు రోజులే పనిచేస్తాయా?
Indian Bank Association on Bank Working Days: ఆదివారం, రెండో శనివారం మినహా అన్ని రోజుల్లో బ్యాంకులు పనిచేస్తున్నాయి. సాధారణంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తున్నాయి. అయితే, బ్యాంకు పనివేళల్లో మార్పులు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇండియా బ్యాంక్స్ అసోసియేషన్ తెలియజేసింది. వారానికి ఆరు రోజుల పనిదినాలు కాకుండా ఐదు రోజులపాటు పనిదినాలను ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు ఐబీఏ తెలియజేసింది. ఒకవేళ ఐదు రోజులు పనిదినాలను తీసుకురావాలి అంటే రెగ్యులర్ టైమింగ్స్‌లో మార్పులు తీసుకురావాలని కూడా ఐబీఏ తెలిపింది.
ఉదయం 10 గంటలకు బదులుగా ఉదయం 9:45 గంటల నుండే బ్యాంకులు ప్రారంభం కావాలి. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు బదులుగా 5:40 వరకు పనివేళలు ఉండాలి. ఈ సవరణలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ఫలవంతం అయితే, త్వరలోనే అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. దేశంలో డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది బ్యాంకులకు వెళ్లడం తగ్గించేశారు. అన్ని లావాదేవీలు దాదాపుగా డిజిటల్ పరంగానే సాగుతున్నాయి. బ్యాంకుల్లో కూడా డిజిటల్ రంగాన్ని ప్రొత్సహిస్తుండటంతో పనివేళల్లో మార్పులు చేసి వారానికి ఐదు రోజులపాటు పనిదినాలు ఉండేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.