India Intelligence Agency Warning: చైనా ఫోన్లపై సైనికులకు అలర్ట్
India Intelligence Agency Warning: భారత సైనికులకు ఇంటిలిజెన్స్ వ్యవస్థ హెచ్చరికలు జారీ చేసింది. చైనా మొబైల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా వినియోగించవద్దని హెచ్చరించింది. వాస్తవాధీన రేఖ వద్ద ఇండియా చైనా మధ్య ప్రతిష్ఠంభన నెలకొన్న నేపథ్యంలో భారత సైనికులకు, సైనికుల కుటుంబాలకు ఇంటిలిజెన్స్ వ్యవస్థ హెచ్చరికలు జారీ చేయడం ఉత్కంఠను రేపింది. చైనా మొబైల్ ఫోన్స్‌లో మాల్‌వేర్, స్పైవేర్‌లను జొప్పించి డేటాను కొల్లగొడుతున్నాయని హెచ్చరించింది. తద్వారా సైనికులు, వారి కుటుంబాల సమాచారాన్ని అక్రమంగా దోచేస్తున్నాయని, వారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా, భారత రక్షణ విషయాలను కూడా కొల్లగొట్టే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వ్యవస్థ హెచ్చరించింది.
గత కొంతకాలంగా ఇండియా, చైనా బోర్డర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవాధీన రేఖ వద్ద నిత్యం రెండు దేశాలకు చెందిన సైనికుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. గత పరిస్థితులను తీసుకొచ్చేందుకు రెండు దేశాల మధ్య అనేకమార్లు చర్చలు జరిగినా సఫలం కాలేదు. భారత్ భూభాగాలను ఎలాగైనా దక్కించుకోవాలని చైనా చూస్తుండగా, భారత్ అందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఎదురుదాడులు చేస్తున్నది. గల్వాన్ లోయ ఘటన ఇందుకు ఓ ఉదాహరణ. భారత్ నుండి ప్రతిఘటనలు ఎదురౌతుండటంతో చైనా తోకముడిచి వెనక్కి వెళ్లిపోయింది.