India beat china: చైనాను దాటేశాం… మనమే నెం 1
India beat china: ఇండియా చైనాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. సరిహద్దు వివాదాల కారణంగా రెండు దేశాల మధ్య వ్యాపారలావాదేవీలు సైతం మందగించాయి. ఇక ప్రస్తుతం చైనాలో కరోనా విలయతాండవం చేస్తున్నది. కరోనా, ఆర్థిక మాంద్యం, ఆంక్షలు తదితర అంశాలు ఆ దేశ జనాభాపై కూడా ప్రభావం చూపుతున్నాయి. అరవై ఏళ్ల కాలంగా జనాభా సగటు శాతం మందగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, భారత దేశంలో జనాభా సంఖ్య భారీగా పెరిగినట్లు వరల్డ్ పాపులేషన్ రివ్యూ సంస్థ తెలియజేసింది. ఈ సంస్థ లెక్కల ప్రకారం, 2023, జనవరి 18 నాటికి భారత దేశ జనాభ 142.3 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది.
ఇదే సమయంలో చైనా జనాభ 141.2 కోట్లుగా ఉన్నట్లు తెలియజేసింది. అయితే, మాక్రోట్రెండ్స్ లెక్కల ప్రకారం భారత జనాభ 142.8 కోట్లుగా ఉన్నట్లు తెలియజేసింది. ఈ లెక్కల ప్రకారం, భారత్ జనాభా విషయంలో చైనాను దాటేసి మొదటిస్థానంలో నిలిచింది. దేశంలో యువతరం సంఖ్య పెరుగుతుండటం భవిష్యత్ అవసరాల దృష్ట్యా అవసరమే అయితే, ఈ యువతరాన్ని వినియోగించుకునే విధానం కూడా చాలా ముఖ్యమైనది. యువతరానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని నిపుణులు చెబుతున్నారు.