ASER 2022: గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల చదువులు ఎలా ఉన్నాయో తెలుసా?
In Rural India 33.7% of mothers, 20.8% of fathers do not have any schooling
యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు (ASER) 2022 ద్వారా అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. పాలకుల కళ్లు తెరిపించింది. మన విద్యావిధానం గాడి తప్పుతోందని హెచ్చరించింది. విద్య కోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషి సరిపోవడం లేదని తేటతెల్లం చేసింది. పాఠశాల విద్య విషయంలో పర్యవేక్షణ కరువైన విషయాన్ని విద్యా సర్వే కళ్లకు కట్టింది. ఇదే విధానం కొనసాగితే దేశ భవిష్యత్తుకు ముప్పని చెప్పకనే చెప్పింది.
కరోనా మహమ్మారి విలయతాండం చేసిన కాలం.. దేశంలో అనేక రాష్ట్రాల్లో విద్యార్ధులపై ప్రభావం చూపింది. అక్షరాలు, పదాలు, వాక్యాలు చదవలేని విద్యార్ధుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అసర్ 2022లో గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
దేశంలోని అనేక గ్రామాల్లో తల్లిదండ్రులకు చదువు లేని కారణంగా వారి పిల్లలు వెనకబడిపోతున్నారని అసర్ సర్వే తెలిపింది. రాజస్థాన్ రాష్ట్రంలో తల్లులు చదువు విషయంలో చాలా వెనకబడి ఉన్నారు. ఆ రాష్ట్రంలో కనీస విద్యార్హత లేని తల్లులు ఎక్కువుగా ఉన్నారు. అదే విధంగా మేఘాలయ రాష్ట్రంలో పిల్లల తండ్రులు చదువులేని వారు ఎక్కువగా ఉన్నారు.
దేశ వ్యాప్తంగా తల్లుల చదువు విషయంలో గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే…మొత్తంగా 33.7 శాతం మంది తల్లులకు చదువు రాదని తేలింది. ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే రాజస్థాన్ రాష్ట్రంలో చదువు రాని తల్లులు 53.4 శాతం మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో బీహార్ నిలిచింది. బీహార్ రాష్ట్రంలో 49.4 శాతం మంది తల్లులకు చదువురాదు. అరుణాచల్ ప్రదేశ్ లోని తల్లులలో 47.9 శాతం మంది తల్లులకు చదువు లేదు. జార్ఖండ్ రాష్ట్రంలో 46.5 శాతం, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 46.4 శాతం మంది తల్లులకు ఎటువంటి చదువు లేదని అసర్ సర్వే 2022 వెల్లడించింది.
రాజస్థాన్ లోని గ్రామీణ ప్రాంతపు తల్లులు చదవు విషయంలో బాగా వెనకబడి ఉన్నారు. కేవలం 8 శాతం మంది తల్లులే 10వ తరగతి పాస్ అయినవాళ్లు ఉన్నారు. 22.5 శాతం మంది 6వ తరగతి కంటే కాస్త ఎక్కువ చదువు చదివారు. 15.9 శాతం మంది 1వ తరగతి నుంచి 6వ తరగతి మధ్యలోనే చదువు ఆపేశారు.
కేరళ రాష్ట్రంలో విద్యార్హత కలిగిన తల్లుల సంఖ్య ఎక్కువుగానే ఉంది. 62.3 శాతం మంది తల్లులు పదోతరగతి పాస్ అయిన వాళ్లు ఉన్నారు. 35.8 శాతం మంది తల్లులు 6వ తరగతి దాటి చదివిన వాళ్లు ఉన్నారు. కేరళ తర్వాతి స్థానంలో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, త్రిపుర రాష్ట్రాల తల్లులు ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నారు.
మేఘాలయ, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో చదువులేని తండ్రుల సంఖ్య ఎక్కువుగా ఉన్నట్లు అసర్ సర్వే ద్వారా తేటతెల్లం అయింది.కేరళ, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం రాష్ట్రాల్లో తండ్రులలో విద్యార్హత ఎక్కువుగా ఉంది.