BJP in Eastern India: ఈశాన్యంలో కమల వికాస రహస్యం
BJP in Eastern India: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు వెలువడ్డాయి. మూడు రాష్ట్రాల్లో 60 చొప్పున సీట్లు ఉండగా, మేజిక్ ఫిగర్ 31. త్రిపురలో బీజేపీ 33 స్థానాల్లో విజయం సాధించి మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. నాగాలాండ్‌లో బీజేపీ కూటమి 37 స్థానాల్లో విజయం సాధించింది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి ఖచ్చితమైన మెజారిటీ రావడంతో కమలం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమైంది. అయితే, మేఘాలయలో హంగ్ ఏర్పడింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. బీజేపీ 3, కాంగ్రెస్ 5, ఎన్‌పీపీ 25, యూడీపీ 11, టీఎంసీ 5 స్థానాల్లో గెలుపొందగా, ఇతరులు 10 చోట్ల విజయం సాధించారు. గతంలో కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ పార్టీ బీజేపీతో పొత్తుపెట్టుకున్నది. ఈసారి ఖచ్చితంగా మేజిక్ ఫిగర్‌ను సాధిస్తుందని అనుకున్నా ఆరు స్థానాలు తక్కువగా రావడంతో మరోసారి బీజేపీతో పొత్తుపెట్టుకునే అవకాశం లేకపోలేదు. బీజేపీతో పాటు మరో ముగ్గురు ఇతరులను కలుపుకొని సంగ్మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. మూడు రాష్ట్రాల్లో కాషాయం పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉండనున్నాయి.
త్రిపురలో కాషాయాన్ని గద్దె దించేందుకు వామపక్షాలు గట్టి ప్రయత్నం చేశాయి. అంతేకాకుండా, రాజవంశానికి చెందిన ప్రద్యోత్ బిక్రమ్ వర్మ తిప్రా మోథా పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ ఎన్నికల్లో గట్టి పోటీని ఇచ్చింది. 12 చోట్ల పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే, అనూహ్యంగా బీజేపీ 33 స్థానాల్లో విజయం సాధించి అధికారం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని సాధించింది. అటు నాగాలాండ్ లో కూడా బీజేపీ కూటమి 37 స్థానాల్లో విజయం సాధించింది. 2014 ముందు వరకు కేవలం ఉత్తరాధికే పరిమితమైన బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించడం వెనుక రహస్యం ఏంటి? అనుసరించిన వ్యూహాలు ఎంటి తెలుసుకుందాం..
అస్సాం రాష్ట్రాన్ని ఈశాన్య రాష్ట్రాల గేట్‌వేగా భావించిన కాషాయం పార్టీ మొదట ఆ రాష్ట్రంలో విజయం సాధించేలా పథక రచన చేసింది. ఈ క్రమంలోనే 2017లో బీజేపీ అస్సాం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పాలనకు చెక్ పెట్టింది. అప్పటి నుండి ఆ రాష్ట్రంలో బీజేపీ హవా మొదలైంది. 2022లో కూడా బీజేపీ విజయం సాధించింది. మొదటిసారి విజయం సాధించిన తరువాత బీజేపీ అస్సాం రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పనులను చెకచెక పూర్తి చేసింది. ముఖ్యంగా అవినీతికి చెక్ పెట్టడమే కాకుండా, ముఖ్యంత్రుల విషయంలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంది. అస్సాంలో అనుసరించిన విధానాలు, వ్యూహాలను ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అమలు చేసింది. దీంతో త్రిపుర, నాగాలాండ్‌లో ఘనవిజయం సాధించింది.
ఈశాన్య భారత దేశంలో సుస్థిరమైన, అభివృద్ధి చెందిన పాలన జరగాలంటే బీజేపీ ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ముందుగానే ఊహించిన అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ప్రధానిగా ఉన్న సమయంలో వాజ్‌పేయి ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి కోసం వివిధ పథకాలు తీసుకొచ్చారు. కాగా, 2014లో మోడీ ప్రధాని అయ్యాక ఆ పథకాలను మరింత ముందుకు తీసుకెళ్లడమే కాకుండా, ఈశాన్యరాష్ట్రాల్లోని సమస్యలపై దృష్టి సారించారు. వేగంగా సమస్యలపై స్పందించే విధంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు.
బీజేపీ కార్యకర్తలు కూడా పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టించారు. ప్రధాని మోడీ పలుమార్లు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తూ అక్కడి సమస్యలకు చెక్ పెట్టే దిశగా అధికార యంత్రాంగంలో కదలికలు తీసుకొచ్చారు. అధికారంలోకి రావాలంటే పొత్తులు పెట్టుకోవడానికి సైతం వెనకాడని బీజేపీ, వివిధ పార్టీలతో పొత్తులను ఏర్పాటు చేసుకొని పాగా వేసింది. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరవేస్తున్నది. ఈ ఏడాది చివర్లో మిజోరాం రాష్ట్రానికి ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో కూడా ఎలాగైనా పాగా వేయాలని కాషాయం నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అవసరమైన చోట్ల నేతలను, అవసరమైతే ముఖ్యమంత్రులను మారుస్తూ ప్రతిపక్షాల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ విజయం సాధిస్తున్నది. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు చోట్ల స్పష్టమైన మెజారిటీని సాధించగా ఒకచోట మరోసారి పొత్తులతో అధికారంలోకి రాబోతున్నది. ఈ ఏడాది ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ విజయం సాధించడానికి బీజేపీ ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది.