హర్యానాలోని నూహ్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినప్పటికీ హిందూ సంఘాలు శోభయాత్ర చేపట్టేందుకు రెడీ అయిపోయాయి. ఈక్రమంలో అప్రమత్తమైన పోలీసులు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు.
Haryana: హర్యానాలోని నూహ్ (Nuh) జిల్లాలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల విశ్వహిందూ పరిషత్ (Vishva Hindu Parishad) చేపట్టిన ర్యాలీపై దుండగులు దాడి చేయడంతో హింసాత్మకంగా మారింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చలరేగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరోసారి హిందూ సంస్థలు సోమవారం శోభయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ శోభయాత్ర చేపట్టి తీరుతామని హిందూ సంఘాలు ప్రకటించాయి. ఈక్రమంలో అప్రమత్తమైన హర్యానా పోలీసులు నూహ్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ (144 Section) విధించారు.
సోమవారం పెద్ద ఎత్తున శోభయాత్ర చేపట్టేందుకు హిందూ సంఘాలు సిద్ధమయ్యాయి. శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశాయి. కానీ ఇటీవల నూహ్‌లో చోటుచేసుకున్న అల్లర్లు, జీ20 షెర్పా గ్రూప్ సమావేశాల దృష్ట్యా అధికారులు శోభయాత్రకు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ హిందు సంఘాలు వెనుకడుగు వేయలేదు. అనుమతి లేకపోయినప్పటికీ శోభయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి.
ఈ పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తతలకు దారితీసేలా ఉండడంతో పోలీసులు నూహ్ జిల్లా వ్యాప్తంగా భారో బందోబస్తు ఏర్పాటు చేశారు. పారామిలటరీ బలగాలను భారీగా మోహరించారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులు, దుకాణాలను మూసివేశారు. అటు జిల్లా సరిహద్దులను కూడా క్లోజ్ చేసి.. బయటి వారిని లోపలికి నూహ్‌లోకి అనుమతించడం లేదు. అలాగే ఉద్రిక్తతలు చోటుచేసుకునేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాలను అమర్చారు.