Health Minster Review: వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయండి, అధికారులకు మంత్రి ఆదేశాలు
దేశంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు అధికం కావడంతో కేంద్రం మరింత అప్రమత్తం అయింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నేడు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేసులు ఎక్కువగా నమోదౌతున్న జిల్లాలపై మరింత కఠినంగా నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా టెస్టులను విపరీతంగా పెంచాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. మ్యుటేషన్లను గుర్తించేందుకు జినోమ్ సీక్వెంసింగ్‌పై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పది రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు
మహారాష్ట్రంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఒక్క ముంబైలోనే 2479 కేసులు నమోదు కావడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మహారాష్ట్రతో పాటు కేరళ, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. భారత దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 90 వేలకు చేరింది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం కోవిడ్ మరణాల సంఖ్య 5,23, 650 కి చేరింది.
లాన్‌సెట్ రిపోర్టు
ప్రపంచ ప్రఖ్యాత జర్నల్ లాన్‌సెట్ (Lancet) ప్రచురించిన కథనం ప్రకారం భారతదేశంలో వ్యాక్సినేషన్ కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా చేపట్టడం ద్వారా 42 లక్షల మందిని మరణం నుంచి కాపాడినట్లు అయిందని తెలిపింది.