H3N2 Virus tension: భయపెడుతున్న హెచ్3ఎన్2 వైరస్… ఆరుగురు మృతి
H3N2 Virus tension: కరోనాతో దాదాపు రెండేళ్లకు పైగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కరోనా కారణంగా లక్షలాది మంది మృతి చెందగా, కోట్లాది మంది ఈ వైరస్ బారిన పడ్డారు. నేటికీ ఈ వైరస్ అనేక కోణాల్లో ఇబ్బందులు పెడుతూనే ఉన్నది. పోస్ట్ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, తాజాగా మరో వైరస్ ప్రాణాంతకంగా మారింది. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నది. అదే హెచ్3ఎన్2 వైరస్. ఏడాది కాలంలో హెచ్3ఎన్2 కేసులు 451 నమోదయ్యాయి. ఆరుగురు మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇన్‌ఫ్లూయోంజా ఏ వైరస్ ఆందోళనకరంగా మారడంతో కేంద్రం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఈ వైరస్ వ్యాప్తి ప్రస్తుతం అధికంగా ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. మార్చి నెలాఖరు వరకు ఈ వైరస్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలియజేసింది. ఇన్‌ఫ్లూయోంజా వైరస్ కారణంగా దగ్గు, జలుబు, జ్వరం వంటివి వస్తాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఇన్‌ప్లూయోంజా కేసులు పెరుగుతున్నాయి. అటు డబ్ల్యూహెచ్ఓ కూడా తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.