H3N2 Virus Tension: విజృంభిస్తున్న హెచ్3ఎన్2 వైరస్… పెరుగుతున్న మరణాలు
H3N2 Virus Tension: కరోనా ముగిసిన తరువాత ఇప్పుడు మరో వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. హెచ్3ఎన్2 ఇన్‌ప్లూయోంజా వైరస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నది. భారత్‌లో ఈ వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. చాపకింద నీరులా దేశంలో వ్యాపిస్తున్నది. కాగా,ఈ వైరస్ కారణంగా ఇప్పటికే అనేక మంది మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పుదుచ్చెరిలో కేసులు పెరుగుతుండటంతో అక్కడ పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మార్చి 16 నుండి 26 వరకు సెలవులు ప్రకటించింది.
ఈ ఇన్‌ఫ్లూయోంజా వైరస్ పిల్లలు, వృద్ధులకు సోకుతుండటంతో జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత వరకు బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇక, పుదుచ్చెరితో పాటు తమిళనాడులోనూ ఈ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 600 లకు పైగా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. కేసులతో పాటు దేశంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సమయంనాటి ప్రొటోకాల్‌ను తిరిగి పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, దూరం పాటించడం చేయాలని సూచిస్తున్నారు. పది పదిహేను రోజుల నుండి ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువ కావడంతో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది.