Covid 19 Cases : మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు… ఆందోళనలో కేంద్రం
Covid 19 Cases increased: గత కొన్ని రోజులుగా ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. ఈ హెచ్ 3 ఎన్2 ఇన్‌ఫ్లూయోంజా వైరస్ కారణంగా ఇప్పటికే దేశంలో ఇద్దరు మృతి చెందినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఇన్‌ఫ్లూయోంజా కేసులు పెరుగుదలతో అప్రమత్తమైన కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నది. నిర్ణక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఇప్పుడు మరో సమస్య కూడా వేధించడం మొదలుపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా కేసులు మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి. ఇప్పటికే మూడు వేవ్‌లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రపంచం మరోసారి ఆ ముప్పును ఎదుర్కొనక తప్పని పరిస్థితులు కలిగే అవకాశం ఉన్నది.
భారత్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల కనిపిస్తున్నట్లు కేంద్రం పేర్కొన్నది. పాజిటివిటీ రేటు పెరుగుతుండటంపై కేంద్రం అప్రమత్తం అయింది. మార్గదర్శకాలు పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రుల్లో మందులు, మెడికల్ ఆక్సీజన్ లభ్యత, టీకాలు వంటి వాటిపై దృష్టి సారించాలని ఆదేశించింది. రాష్ట్రాల్లోని ప్రజలు మార్గదర్శకాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పాజిటివిటీ రేటు పెరుగుతుండటంతో ఈ విధమైన ఆదేశాలను జారీ చేసింది.