ప్రధానిని టార్గెట్ చేస్తున్నారు.. వెనుకాడేది లేదు!
తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బిజెపి అంటే భయపడుతున్నాయని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. బిజెపి బుల్డోజర్ మన రాష్ట్రాల్లోకి వస్తుందని, రాజకీయ భవిష్యత్తు ఉండదని కొన్ని పార్టీలు భయపడుతున్నాయని ఆయన అన్నారు. కేంద్రం, రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తున్నా విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. మంత్రి కేటీఆర్ ప్రదానిపై హద్దు మీరి మాట్లాడారని, ప్రధానిని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. బిజెపిపై ఉన్న భయాన్ని తెలియజేసే విధంగా కేటీఆర్ వాఖ్యలు ఉన్నాయని ఆయన అన్నారు. తమ చానల్, పేపర్లలో తప్పుడు రాతలు రాస్తున్నారని, ఈ విషయం మీద సభాహక్కుల నోటీస్ ఇచ్చానని అన్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పై సభా హక్కుల నోటీసులు గతంలో ఇచ్చానని ఆయన అన్నారు. కేంద్రాన్ని, నరేంద్రమోడీని, బిజెపిని దూషిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకాడమని అన్నారు. 2009-10 లో 15 వేల 72 కోట్లు అంటే కేటీఆర్ తండ్రి కేంద్ర క్యాబినెట్ లో ఉన్నప్పటి కంటే ఎక్కువ రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చామని అన్నారు. కేసీఆర్ కేంద్ర క్యాబినెట్ లో ఉన్నపుడు, తెలంగాణ గుర్తు లేదా అని ప్రశ్నించిన ఆయన ఏపీలో కేంద్ర వాటా కింద నిధులు ఇస్తున్నా, ప్రభుత్వ పథకాలకు వాళ్ళ స్టిక్కర్లు పెడుతున్నారని, జగనన్న గృహాలు అని చెప్పుకుంటున్నారని అన్నారు. కేంద్ర నుంచి వచ్చే నిధులు ఉపయోగిస్తే, కేంద్రం వాటా ఉందని చెప్పాలని, ఇలా తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. ప్రధాని ఉచితంగా బియ్యం ఇస్తున్నారు, సబ్సిడీ కింద ఇస్తున్న బియ్యం పథకానికి మీ ఫోటోలు ఎలా పెడతారు? ఈ విషయం మీద జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విజయనగరం లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, కడపలో ధర్మేంద్ర ప్రధాన్ పర్యటిస్తారని, విశాఖలో జయశంకర్ పర్యటిస్తారని అన్నారు. ప్రజా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడతామని, కుటుంబ రాజకీయాల వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు అనే ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. టీఆర్ఎస్ లో ఫ్రస్టేషన్ కనిపిస్తోందని అన్నారు.
కాంగ్రెస్ లో ప్రశాంత్ కిషోర్ చేరికపై స్పందించిన జివిఎల్
కాంగ్రెస్ లో ప్రశాంత్ కిషోర్ చేరికపై జీవీఎల్ స్పందించారు. ప్రశాంత్ కిషోర్ చేరికపై కొత్త రాజకీయ ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయని అన్నారు. పీకే కాంగ్రెస్ లో చేరితే టీఆర్ఎస్ ను కలుపుకుంటారా? అలాగే కాంగ్రెస్ వైసీపీని అక్కున చేర్చుకుంటుందా? అని ప్రశ్నించారు.